తెలంగాణ అసెంబ్లీ(TG Assembly)లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. రాష్ట్రంలో ఏం పనులు కావాలన్నా 30 శాతం కమీషన్లు కాంగ్రెస్ నేతలు తీసుకుంటున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతూ.. 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లు కేటీఆర్ నిరూపించాలని, నిరూపించలేకపోతే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మీలాగా బరితెగించి రాజకీయాలు చేయడం లేదని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరేనని ఫైర్ అయ్యారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి బీఆర్ఎస్ సభ్యులకు హితవు పలికారు. దీంతో భట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు.