Telangana political landscape : “మరో రెండేళ్లలో మేమే అధికారంలోకి వస్తాం.. ఎగిరెగిరి పడుతున్న ప్రతీ ఒక్క అధికారి లెక్కలు సరిచేస్తాం!” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే లక్ష్యంగా ఆయన చేసిన ఈ ఘాటైన హెచ్చరికలు కేవలం రాజకీయ ఆవేశమా…? లేక కాంగ్రెస్ ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి పంపిన బలమైన సంకేతమా..?
అధికారులే టార్గెట్.. హెచ్చరికల ఆంతర్యం : పరిగి నియోజకవర్గంలో పార్టీ చేరికల సందర్భంగా కేటీఆర్ తన స్వరానికి పదునుపెట్టారు. రాష్ట్రంలోని కొందరు కలెక్టర్లు, పోలీసు అధికారులు ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ, కాంగ్రెస్ నేతల వలె “చిలుక పలుకులు” పలుకుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఖైరతాబాద్‌లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిబంధనలు అతిక్రమించి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. “ఎక్కువ సమయం లేదు.. మరో రెండున్నరేళ్లలో మేమే వస్తాం. రేవంత్ రెడ్డి కంటే ఎక్స్‌ట్రాలు చేసే వారి పేర్లు బరాబర్ రాసి పెట్టుకుంటాం. ప్రతి ఒక్కరి లెక్కలు సెటిల్ చేసే బాధ్యత నాది” అని కేటీఆర్ స్పష్టం చేయడం, ఈ హెచ్చరికల తీవ్రతను తెలియజేస్తోంది.
గత పాలన ఘనతలు.. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు : తమ పదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించడంలో విఫలమయ్యామని కేటీఆర్ ఆత్మవిమర్శ చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశలు చూపి అధికారంలోకి వచ్చిందే తప్ప, ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, నూతన జిల్లాలు, మండలాలు, కలెక్టరేట్‌ల ఏర్పాటు వంటి పరిపాలనా సంస్కరణలను ఆయన గుర్తుచేశారు. రైతు వేదికలు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు ద్వారా రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలో భూముల ధరలు పడిపోయాయని, రైతులకు గిట్టుబాటు ధర దొరకడం లేదని, ఎరువులు, విత్తనాల కోసం రైతులు లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. “తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టు ఉంది” అని రైతులు వాపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దుర్మార్గపు పాలన వల్ల తెలంగాణ మళ్లీ 15 ఏళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని, రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.


