Sunday, July 13, 2025
HomeతెలంగాణKTR: ఫోన్ ట్యాపింగ్.. నీచ ప్రచారం చేస్తున్న వారికీ కేటీఆర్ వార్నింగ్

KTR: ఫోన్ ట్యాపింగ్.. నీచ ప్రచారం చేస్తున్న వారికీ కేటీఆర్ వార్నింగ్

KTR Warning: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు విచారణను సిట్ అధికారులు ముమ్మరం చేశారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు తమ ఫోన్ ట్యాప్ అయిందంటూ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరై తమ వాంగ్మూలం ఇచ్చారు. అయితే విచారణకు హాజరైన కొందరు నేతలు ఫోన్ ట్యాపింగ్ వెనక మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు.

వారి ఆదేశాలతోనే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వలోని బృందం ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు చేశారు. కొంతమంది అయితే ఏకంగా హీరోయిన్లు ఫోన్లు ట్యాప్ చేసి లోబర్చుకోవాలని చూశారంటూ సంచలన ఆరోపణలు కూడా చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు అరెస్ట్ అవుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తనపై వస్తున్న దుష్ప్రచారంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కావాలనే లేని పోని ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈహమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మీడియా సంస్థలను నడుపుతున్న కొంతమంది వ్యక్తులు జర్నలిస్టుల ముసుగులో కావాలనే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు కొంతమందితో కలిసి ఓ ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .

కొంతమంది మీడియా సంస్థల యజమానులు తనపై వ్యక్తిగతంగానూ అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తుల నీచమైన అభిప్రాయాలు తనపై వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపించవు అన్నారు. కానీ పదేపదే చేస్తున్న వ్యక్తిత్వ హననం వలన తన కుటుంబ సభ్యులతో పాటు శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులను, పార్టీ శ్రేణులను బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. దీని వెనక ఎవరు ఉన్నారో తనకు తెలుసని.. వారిపై తగిన రీతిలో చర్యలు తీసుకుంటానని కేటీఆర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News