KTR’s ‘Bulldozer’ Jibe at Revanth Reddy: “మీకు అభివృద్ధి చేసే కారు కావాలో, పేదల ఇళ్లు కూల్చే బుల్డోజర్ కావాలో మీరే తేల్చుకోండి!” అంటూ రేవంత్ సర్కార్‌పై విమర్శలను పదును పెట్టారు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ భవన్లో ఆదివారం కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ప్రశ్నలను సంధించారు.
ALSO READ: Konda Surekha: పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ ఫైర్.. నా శాఖలో మీ పెత్తనం ఏంటి?
అవినీతి సొమ్మంతా జూబ్లీహిల్స్‌లో ఖర్చు.. ఓటుకు రూ.10 వేలు
“సీఎం రేవంత్ రెడ్డి గరీబోళ్ల ఇళ్లు ఎక్కడున్నాయా అని వెతికి మరీ బుల్డోజర్లు పంపి కూల్చేస్తున్నారు. చట్టాలు, కోర్టులు, డాక్యుమెంట్లు.. ఏవీ ఆయనకు లెక్కలేదు. అందుకే ఈ ఎన్నిక కేవలం ఒక ఎమ్మెల్యేను ఎన్నుకోవడం కోసం కాదు, ఈ బుల్డోజర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం. గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మంచి పనైనా చేసిందా? ఒక్క ఇల్లు కట్టిందా? ఒక్క ఇటుకైనా వేసిందా? ఏమీ లేదు. కానీ, 2 లక్షల 30 వేల కోట్ల అప్పు మాత్రం చేసింది. ఇప్పుడు ఆ అవినీతి సొమ్మంతా తీసుకొచ్చి జూబ్లీహిల్స్‌లో ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. ఓటుకు రూ.10,000 ఇచ్చి మిమ్మల్ని కొనాలని చూస్తారు, జాగ్రత్త! ఆ డబ్బుకు ఆశపడి మీరు కాంగ్రెస్‌కు ఓటేస్తే, మీ ఇళ్ల మీదికి బుల్డోజర్లు వచ్చినట్టే లెక్క.” అని కేటీఆర్ పేర్కొన్నారు.
ALSO READ: Jubilee Hills: నవీన్ యాదవ్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన హీరో.. ఎన్నికల్లో గెలిపించాలంటూ సెల్ఫీ వీడియో
తెలిసి కూడా మోసం చేయడమే రేవంత్ నైజం..
“ఆరు గ్యారెంటీలు అని చెప్పి మిమ్మల్ని ఎలా మోసం చేశారో చూశారు కదా? బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడారు, అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ అని చెప్పి మోసం చేశారు. తెలిసి కూడా ప్రజలను మోసం చేయడమే రేవంత్ రెడ్డి నైజం. ‘మోసం చేసేవాళ్లనే ప్రజలు నమ్ముతారు’ అని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు” అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడించినప్పుడే కాంగ్రెస్‌కు భయం పుట్టి, నెలకు రూ.4000 పెన్షన్ వస్తుంది, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారని కేటీఆర్ అన్నారు. మళ్లీ హైదరాబాద్ అభివృద్ధి గాడిన పడాలంటే, కేసీఆర్ తిరిగి రావాలని, ఆ మార్పు జూబ్లీహిల్స్ నుంచే మొదలుకావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పండని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ALSO READ: MLC Balmuri Venkat: శ్రీకాంత్ అయ్యంగార్ ‘మా’ సభ్యత్వం రద్దు చేయాలి.. బల్మూరి వెంకట్ డిమాండ్.


