Kukatapalli Murder Case: కూకట్‌పల్లి లో పదేళ్ల చిన్నారి సహస్ర హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆగస్టు 18న జరిగిన ఈ ఘటన తర్వాత పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఒడిశాకు చెందిన సంజయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను సహస్ర కుటుంబం నివసిస్తున్న భవనంలో రెండో అంతస్తులో అద్దెకు ఉంటున్నట్టు దర్యాప్తులో తేలింది.
సీసీటీవీ దృశ్యాలు…
ఈ కేసులో సంజయ్ పేరు వెలుగులోకి రావడానికి కారణం సీసీటీవీ దృశ్యాలు. హత్య జరిగిన రోజు ఉదయం 9 గంటల 57 నిమిషాలకు అతను భవనం గేటు పక్కన అనుమానాస్పదంగా కదులుతున్నట్లు కెమెరాలో రికార్డయింది. ఆ సమయంలో ఒక పారిశుద్ధ్య కార్మికుడు అక్కడికి రావడంతో సంజయ్ గేటు వెనుక దాక్కున్నట్లు కూడా విజువల్స్‌లో స్పష్టంగా కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈ ఫుటేజ్ ప్రస్తుతం దర్యాప్తులో ప్రధాన ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు.
పదునైన కత్తితో…
చిన్నారి సహస్రను ఆగస్టు 18న మధ్యాహ్నం ఒంటరిగా ఉన్న సమయంలో హత్య చేశారు. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. గొంతు కోసి, పదునైన కత్తితో పొడిచి క్రూరంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసు తర్వాత కూకట్‌పల్లి పరిసరాల్లోని ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి.
ప్రస్తుతం పోలీసులు తల్లిదండ్రులను కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే హంతకుడు కుటుంబానికి పరిచయమున్న వ్యక్తే కావచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. దర్యాప్తు ఆధారంగా సంజయ్ పై అనుమానాలు మరింత బలపడ్డాయి. అతని భార్య అనారోగ్యానికి సహస్ర కుటుంబమే కారణమని అతను తరచూ అనుమానం వ్యక్తం చేసేవాడని, అందుకే ప్రతీకార భావంతో ఈ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు పరిశీలిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-rules-for-placing-ganesh-idol-at-home/
సంజయ్ అదుపులోకి వచ్చిన తర్వాత అతనిపై విచారణ కొనసాగుతోంది. అతను హత్యలో నేరుగా ప్రమేయం ఉన్నాడా లేదా అన్నది పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ సాక్ష్యాలు, సాంకేతిక ఆధారాలు, స్థానికుల వాంగ్మూలాల ద్వారా స్పష్టత తీసుకువస్తున్నారు.


