కులగణన సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన సర్వే మెగా హెల్త్ చెకప్ లాంటిదని ముఖ్యమంత్రి అన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందాలంటే కులగణన సర్వే జరగాలని, సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. కొంతమంది కుట్ర పూరితంగా కులగణన సర్వేపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు, ఇది ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తొలగించడానికి కాదని, కులగణన సర్వేకు అడ్డు వస్తే వారిని ద్రోహులుగా భావించాలని పిలుపునిచ్చారు. కులగణన సర్వే కోసం అధికారులు ఇంటింటికి వస్తున్నారని, కులగణనకు సహకరించాలని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పలు అంశాలపై తన మనసులో మాట చెప్పారు.
స్కూళ్లకు ఉచిత విద్యుత్
ఉచిత నిర్బంధ విద్య ద్వారా పేదలకు విద్యను అందించేందుకు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ఎంతో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో 7 శాతం పైగా విద్యా శాఖకు కేటాయించిందన్న సీఎం, 20 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామన్నారు. 35 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేశామని, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పాఠశాలల్లో అటెండర్స్, స్వీపర్స్, పారిశుద్ధ్య నిర్వణకు ప్రతీ ఏటా రూ.150 కోట్లు కేటాయించామని, త్వరలోనే యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.
మీతో నడిచి మీతో చేయి కలుపుతున్నా..
కుక్క పిల్ల చనిపోతే డాక్టర్ ను జైల్లో వేసిన పరిస్థితి ఆనాటి ముఖ్యమంత్రిదంటూ నిప్పులు చెరిగిన సీఎం రేవంత్, ఈ ముఖ్యమంత్రి మీతో నడిచి మీతో చేయి కలుపుతున్నాడని వివరించారు.
చదువుతో పాటు క్రీడల్లో రాణించండి..
వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలి..
ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉందని, 21 ఏళ్లకు ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు కోసం అసెంబ్లీలో రెజల్యూషన్ మూవ్ చేయాలని శ్రీధర్ బాబుకి సీఎం సభాముఖంగా విజ్ఞప్తి చేయటం హైలైట్. రాజకీయాల్లో యువతరానికి అవకాశాలు పెరగాలంటే ఇలాంటి మార్పులు అవసరమని సీఎం అన్నారు.