మావోయిస్టుల ఎన్కౌంటర్ (Maoists Encounter) లు అన్నీ ప్రభుత్వ హత్యలే అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాలనరసింహా లతో కలిసి కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ పై స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశమంతా అల్లకల్లోల భారత్ తయారైందని, మావోయిస్టుల ఎన్కౌంటర్ పేరుతో జరుగుతున్న హత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. దేశంలో మానవ హక్కుల పరిరక్షణలో అత్యున్నత న్యాయవ్యవస్థ భాగస్వామ్యం కావాలని, పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సంఘటనలను న్యాయవ్యవస్థ సుమోటోను బాధ్యతగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థ పట్టించుకోనట్లయితే దేశంలో మానవ హక్కులకు స్థానం లేకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు.
2026 నాటికి మావోయిస్టులను తుడిచిపెడతామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించడంలోని అర్ధం ఏమిటని, ప్రశ్నించే వారికి స్వేచ్ఛ లేదా?వారిని బతకనివ్వరా? అని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టులు పరిమిత సంఖ్యలోనే ఉండవచ్చని, కానీ వారితో పాటు కమ్యూనిస్టులందరి భావజాలం ప్రశ్నించడమేనని, ప్రశ్నించే వారందరినీ చంపేస్తారా? అని సాంబశివరావు నిలదీశారు. అమిత్ షా చేసే తప్పులకు ఆయనను ఏమి చేయాలని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం గత పదేళ్లలో దాదాపు 10 వేల మంది మావోయిస్టులను మట్టుబెట్టిందని, ప్రశ్నిస్తున్న ప్రజాసామ్యవాదులు, మేధావులను అర్బన్ నక్సలైట్ల పేరుతో జైళ్లలో సంకెళ్లు వేసి చంపేస్తున్నారని కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) ఆవేదన వ్యక్తం చేశారు.
“తెలంగాణ రాష్ట్రంలో, పరిసర ప్రాంతాల్లో కూడా ఎన్కౌంటర్ లు జరుగుతున్నాయి. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నాయా? తెలియక జరుగుతున్నాయా? ఆలోచించుకోవాలి. లేకపోతే కేంద్ర మంత్రి అమిత్ షా చెబితే చేస్తున్నారా? ఛత్తీసగఢ్ తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ పోలీసులు ఎందుకు పాల్గొన్నారు? ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించి సమాధానం చెప్పాలి. ఒక వేళ తెలియక జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ చొరవ తీసుకుని జరుగుతున్న పరిణామాల పట్ల సమీక్షించాలి” అని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.