సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే పోలీసులు సీపీఆర్ చేయడంతో బాబు ప్రాణాలు దక్కాయని వైద్యులు చెప్పారని తెలిపారు. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వివాదంగా తొక్కిసలాట ఘటన అంశం మారిందన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. అలాగే సినిమా రంగంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో సినిమాలు సందేశాత్మకంగా ఉండేవని.. ఇప్పుడు సినిమాల్లో విలన్లను హీరోలుగా చిత్రీరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
సెన్సార్ బోర్డు అసలు ఏం చేస్తుందని ప్రశ్నించారు. సామాజిక సందేశాత్మక చిత్రాలకు అనుమతులు ఇవ్వకుండా.. రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు అనుమతులు ఇవ్వడం శోచనీయమని పేర్కొన్నారు. బౌన్సర్లు వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వానికి కమ్యూనిస్టు పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని కూనంనేని వెల్లడించారు.