Kurnool bus accident government response : జాతీయ రహదారిపై జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశాన్ని కుదిపివేసింది. కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధమై, 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ, తక్షణ సహాయాన్ని ప్రకటించారు. ఈ పెను విషాదం నేపథ్యంలో, బాధితుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగింది. అసలు ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టింది..? సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలి..?
ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన : కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘోర దుర్ఘటన అత్యంత బాధాకరమని, తన ఆలోచనలన్నీ మృతుల కుటుంబాలతోనే ఉన్నాయని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 50,000 తక్షణ సాయం అందిస్తామని వెల్లడించారు.
స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి : ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్సు కావడంతో, ఆయన వెంటనే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో ఫోన్‌లో మాట్లాడి, సహాయక చర్యల గురించి ఆరా తీశారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని, తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
రంగంలోకి ప్రభుత్వ యంత్రాంగం.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే : ఈ పెను విషాదం నేపథ్యంలో, కన్నీరుమున్నీరవుతున్న బాధితుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు, సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు కర్నూలు జిల్లా యంత్రాంగం పలు కంట్రోల్ రూమ్‌లు, హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసింది. మీ ఆత్మీయుల గురించి సమాచారం తెలుసుకోవడానికి, దయచేసి ఈ కింది నంబర్లను సంప్రదించగలరు.
ప్రధాన కంట్రోల్ రూమ్‌లు:
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08518-277305
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కంట్రోల్ రూమ్: 9121101059
ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్: 9121101061
కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్: 9121101075
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు:
9494609814
9052951010
బాధిత కుటుంబాలు, బంధువులు పై నంబర్లకు ఫోన్ చేసి, తమ వారి గురించి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు విజ్ఞప్తి చేశారు.


