పూజలు చేస్తానని లక్షల్లో మోసం చేశాడని.. లేడీ అఘోరీపై ఓ ప్రొడ్యూసర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ – మధ్యప్రదేశ్ సరిహద్దులో అఘోరీని అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొస్తున్నారు. ఆమెతో పాటు ఇటీవల అఘోరీని చేసుకున్న వర్షిణిని కూడా పోలీసులు తరలిస్తున్నారు. శంకర్‌పల్లి మండలం, ప్రొద్దుటూర్‌కు చెందిన లేడీ ప్రొడ్యూసర్.. లేడీ అఘోరిని దాదాపు ఆరు నెలల క్రితం పరిచయం అయ్యింది.
రెండు నెలల వ్యవధిలోనే ప్రగతి రిసార్ట్‌లో డిన్నర్‌కు రావడం మొదలుకొని, తరచూ ఫోన్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకునేది. అఘోరి మాటలతో నమ్మిన లేడీ ప్రొడ్యూసర్.. “ఒక పెద్ద పూజ చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది” అనే మాటలతో లోనిపోయింది. పూజ కోసం మొదట రూ. 5 లక్షలు అఘోరీ అకౌంట్‌లో వేసింది. తర్వాత యూపీలోని ఉజ్జయినికి తీసుకెళ్లి పూజ చేయించారు. మరుసటి రోజు మరో రూ. 5 లక్షలు ఇవ్వాలని, లేకపోతే పూజ ఫలించదని, కుటుంబం ప్రమాదంలో పడుతుందని భయపెట్టారు. దాంతో మరోసారి డబ్బులు పంపించిందట. అంతటితో ఆగకుండా.. ఇప్పుడు పూజ పూర్తయింది.
తర్వాత మాతకు నైవేద్యం పెట్టాం. ఇప్పుడు ఇంకా రూ. 5 లక్షలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మంత్రశక్తులతో నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తా అంటూ బెదిరించిందట. దీంతో మోసపోయానని తెలుసుకున్న లేడీ ప్రొడ్యూసర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన మోకిలా పోలీసులు.. ఎట్టకేలకు లేడీ అఘోరీని పట్టుకుని నగరానికి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.