Saturday, November 15, 2025
HomeతెలంగాణLand Registration Fraud: 'బై' నంబర్ల మాయాజాలం.. అసలు యజమానుల గుండెల్లో భారం!

Land Registration Fraud: ‘బై’ నంబర్ల మాయాజాలం.. అసలు యజమానుల గుండెల్లో భారం!

Land registration fraud with by-numbers : మీ స్థలం మీదేనని ధీమాగా ఉన్నారా? అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని భరోసాతో ఉన్నారా? అయితే ఒక్కసారి ఆగండి. రిజిస్ట్రేషన్ అధికారుల చిన్న నిర్లక్ష్యం, ఓ అదనపు ‘బై’ నంబరు మీ యాజమాన్య హక్కులనే ప్రశ్నార్థకం చేయగలదు. మీ స్థలాన్ని మీకే తెలియకుండా ఇతరుల పరం చేయగలదు. అసలు ఈ ‘బై’ నంబర్ల దందా ఏంటి..? అధికారుల తప్పిదాల వల్ల సామాన్యులు ఎలా నష్టపోతున్నారు..? కోట్లాది రూపాయల భూములు ఎలా చేజారిపోతున్నాయి..?

- Advertisement -

రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అధికారుల నిర్లక్ష్యం అసలైన భూ యజమానుల పాలిట శాపంగా మారుతోంది. కేవలం ఒక ‘బై’ నంబర్‌ను అడ్డం పెట్టుకుని కొందరు అక్రమార్కులు విలువైన స్థలాలపై దొడ్డిదారిన హక్కులు పొందుతుండటంతో, ఏ పాపం తెలియని యజమానులు తమ ఆస్తిని తామే నిరూపించుకోవడానికి కోర్టుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివార్లలో భూముల ధరలు విపరీతంగా ఉన్న ప్రాంతాల్లో ఈ దందా యజమానుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.

రూ.750 కోట్ల ప్రభుత్వ భూమికే ఎసరు : ఈ ‘బై’ నంబర్ల మాయాజాలం ఎంతటి ప్రమాదకరమో చెప్పడానికి బంజారాహిల్స్‌లోని ఘటనే నిదర్శనం. ఇక్కడి సర్వే నంబరు 403లో ఉన్న రూ.750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ అక్రమార్కుడు కేవలం ఒక ‘బై’ నంబర్‌ను సృష్టించి కాజేయాలని చూశాడు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాడు. చివరికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) రంగంలోకి దిగి, అసలు రికార్డులను బయటకు తీసి ఆ భూమిని కాపాడింది. లేదంటే ప్రభుత్వానికే సున్నం పెట్టేవారు.

ఒకే స్థలం.. రెండు రిజిస్ట్రేషన్లు..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో 1997లో ఏడుగురు వ్యక్తులు ఒకే సర్వే నంబరులోని ఏడు ఫ్లాట్లను కొనుగోలు చేసి, సక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాని ఆధారంగా ఇంటి నంబర్లు, విద్యుత్ మీటర్లు పొంది, 2007లో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకున్నారు. 20 ఏళ్లుగా అంతా సవ్యంగానే ఉంది. కానీ, 2018లో నారాయణ రెడ్డి అనే వ్యక్తి అదే ఏడు ఫ్లాట్లకు సంబంధించిన సర్వే నంబరుకు ‘ఎ’ అనే బై నంబరును అదనంగా చేర్చి, వేరే వారికి విక్రయించాడు.

అసలు విషాదం ఇక్కడే మొదలైంది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలోని అధికారి ఆ భూమికి సంబంధించిన పాత చరిత్రను (లింక్ డాక్యుమెంట్లు) పరిశీలించకుండానే గుడ్డిగా కొత్త ‘బై’ నంబరుతో రిజిస్ట్రేషన్ చేసేశారు. ఆ నకిలీ పత్రాలను అడ్డం పెట్టుకుని కొత్త కొనుగోలుదారులు ఇంటి నంబర్లు, విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేస్తే, సంబంధిత శాఖల అధికారులు కూడా ఏమీ చూడకుండా మంజూరు చేసేశారు. దీంతో, 20 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న అసలైన యజమానులు ఇప్పుడు తమ ఆస్తిపై హక్కును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మీనమేషాలు లెక్కిస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అసలేంటీ ‘బై’ నంబర్ : ప్రతి భూమికి లేదా స్థలానికి ఒక మూల సర్వే నంబర్ ఉంటుంది. ఆ సర్వే నంబర్‌లోని కొంత భాగాన్ని అమ్మినా, లేదా కుటుంబ సభ్యులు పంచుకున్నా, కొత్తగా ఏర్పడిన భూ భాగానికి పాత సర్వే నంబర్ పక్కన ‘/’ గుర్తుతో ‘ఎ’, ‘బి’ లేదా ‘1’, ‘2’ వంటి ఉప సంఖ్యను చేర్చి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేస్తారు. దీనినే ‘బై నంబర్’ అంటారు. అయితే, నిబంధనల ప్రకారం ఇలా బై నంబర్ కేటాయించే ముందు ఆ భూమి లేదా స్థలం పూర్తి చరిత్రను, లింక్ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ, ఈ ప్రాథమిక సూత్రాన్ని గాలికొదలడమే ఈ మోసాలకు కారణమవుతోంది.

పరిష్కారం లేదా : రాష్ట్రంలో చివరిసారిగా సమగ్ర భూ సర్వే జరిగింది 1936లో. చట్ట ప్రకారం ప్రతి 30 ఏళ్లకు ఒకసారి సర్వే జరగాలి, కానీ జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్ర సర్వే చేపడితే, అన్ని భూములకు కొత్త, ప్రత్యేకమైన నంబర్లు వస్తాయి. తద్వారా ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ సమయంలో భూమి పటాన్ని జతచేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసినట్లు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు కూడా ఈ విధానం అమలు చేస్తే సమస్యలను మొగ్గలోనే తుంచేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad