Saturday, November 15, 2025
HomeతెలంగాణJubilee hills: జూబ్లీహిల్స్‌లో 321 నామినేషన్లు.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా అధిక సంఖ్యలో దాఖలు!

Jubilee hills: జూబ్లీహిల్స్‌లో 321 నామినేషన్లు.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా అధిక సంఖ్యలో దాఖలు!

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు అనూహ్యంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తొలి 6 రోజుల్లో 94 మంది నామినేషన్లు వేయగా.. చివరి రోజైన మంగళవారం 189 మంది అభ్యర్థులు బంజారాహిల్స్‌లోని షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల్లోపు వీరందరి నామినేషన్ల దాఖలుకు సమయం సరిపోకపోవడంతో రిటర్నింగ్‌ అధికారి టోకెన్లు ఇచ్చి వరుస క్రమంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశాన్ని కల్పించారు. రాత్రి తొమ్మిదిన్నర వరకూ 90 మంది నామినేషన్లు మాత్రమే పూర్తవడంతో అర్ధరాత్రి దాటింది. అయినప్పటికీ ఈ ప్రక్రియ కొనసాగుతుందన్న అంచనాతో ఎన్నికల కమిషన్‌ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. దీంతో చివరి రోజైన మంగళవారం 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లు దాఖలు చేశారు. ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నేడు నామినేషన్ లను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ ల ఉపసంహారణకు ఈ నెల 24 తుది గడువుగా ఎన్నికల నోటిఫికేషన్ లో తెలిపారు.

- Advertisement -

ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక నామినేషన్లు: ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారి సంఖ్య అధికంగా పెరిగింది. యాచారంలోని ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులు, ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణలో భూములు కోల్పోనున్న అన్నదాతలు నామినేషన్లు వేశారు. ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ నిరుద్యోగ ఐకాస, ఎస్సీ వర్గీకరణకు నిరసనగా మాలసంఘాల ఐకాస ప్రతినిధులు, పదవీ విరమణ అనంతరం ప్రయోజనాలు మంజూరు చేయలేదంటూ విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధులు నామినేషన్లు వేసేందుకు వచ్చారు.

ఈవీఎంలతోనే ఎన్నికలు: ఎంత మంది బరిలో నిలిచినా ఈవీఎంలతోనే ఎన్నికలు జరుగుతాయని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన ఎం3 రకం ఈవీఎంపై గరిష్ఠంగా 384 మంది అభ్యర్థుల పేర్లను చేర్చవచ్చని పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్:

నామినేషన్ల స్వీకరణ ప్రారంభం : ఈ నెల 13
నామినేషన్ల దాఖలు చివరి రోజు : ఈ నెల 21
నామినేషన్ల పరిశీలన              : ఈ నెల 22
నామినేషన్ల ఉపసంహరణ        : ఈ నెల 24
పోలింగ్                              : వచ్చేనెల 11
కౌంటింగ్                             : వచ్చేనెల 14

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad