తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని రాష్ట్ర డీజీపీ జితేందర్(DGP Jitender) తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వార్షిక క్రైమ్ రేట్ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది 2 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయన్నారు. జీరో డ్రగ్స్ స్టేట్‌గా తెలంగాణను నిలపాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఈ ఏడాది 20 టన్నుల గంజాయి సీజ్ చేశామని.. దాని విలువ రూ.142 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
2024లో 33,618 సైబర్ క్రైమ్, 1525 కిడ్నాప్, 703 చోరీ, 58 దోపిడీ, 856 హత్య, 2945 అత్యాచారాల కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఇక డయల్ 100కు 16,92,173 పిర్యాదులు వచ్చాయన్నారు. కొత్త చట్టం వచ్చిన తర్వాత 85,190 కేసులను నమోదు చేశామమన్నారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.180 కోట్లను తిరిగి బాధితులకు అప్పగించామన్నారు. డ్రగ్స్ కేసుల్లో 4,682 మంది నిందితులను అరెస్టు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే 48 డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో దర్యాప్తు సాగుతోందన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీబీఐకి లేఖ రాశామన్నారు. నిందితులను విదేశాల నుంచి భారత్‌కు రప్పించడానికి ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు.