PV Narasimha Rao Birth Anniversary:దివంగత ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖ నేతలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన తొలి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతిని గుర్తు చేసుకున్నారు. 1991 ఆర్థిక మాంద్యంలోనూ ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చిన శక్తివంతమైన నాయకుడిగా పీవీ చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘననివాళి అర్పించారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారని తెలిపారు.
ఆర్థిక సంస్కరణలతో దేశానికి ప్రగతి బాటలు వేసిన దార్శనికుడు పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అఖండ భారతాన్ని ఏలిన తొలి తెలుగుతేజం తెలంగాణ ముద్దు బిడ్డ పి.వి. నరసింహా రావు అని కొనియాడారు. నాడు పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడిందన్నారు.
హస్తిన పీఠాన్ని అధిరోహించిన తెలుగు నాయకుడు. సంస్కరణల పితామహుడిగా ఆర్థిక సామాజిక రంగాలను ప్రభావితం చేసిన అపర చాణిక్యుడు పీవీ నరసింహారావు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు ఉత్తమ పార్లమెంటేరియన్, మాజీ ప్రధాని, భారతరత్న కీర్తిశేషులు పి.వి నరసింహారావు జయంతి సందర్భంగా వారి అసమాన సేవలను స్మరిస్తూ వారికి నమస్సుమాంజలు చెప్పారు. యావత్ భారతం వారి ఆచరణీయ మార్గాన్ని నిత్యం అనుసరించాల్సిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులు అర్పించారు. తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ఆయన కీర్తిగడించారని పేర్కొన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందామన్నారు.
దేశం క్లిష్ట సమయంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని పీవీ నరసింహారావు కాపాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘననివాళులు అర్పిస్తున్నాని పోస్ట్ చేశారు. విదేశాంగ విధానాన్ని బలోపేతం చేయడంతో పాటు విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పీవీ చేసిన సేవలు అనుసరణీయమని ప్రశంసించారు.