Legal Notices to Bhatti Vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లీగల్ నోటీసులు అందాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన రామచందర్‌రావు ఆయనను లీగల్ నోటీసులు పంపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు తానే కారణమంటూ భట్టి విక్రమార్క ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై మూడు రోజుల్లో తనుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
క్షమాపణలు చెప్పని పక్షంలో చట్టపరంగా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాకుండా రూ.25లక్షలకు పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. ఈమేరకు తన వ్యక్తిగత న్యాయవాదితో నోటీసులు పంపారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని ఈ నోటీసులకు జత చేశారు.
కాగా ఇటీవల ఢిల్లీలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులకు బీజేపీ ప్రమోషన్లు ఇస్తుందని ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుపుతోందన్నారు. త్వరలోనే రోహిత్ చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు. యూనివర్సీటీ యాజమాన్యం రోహిత్‌పై చర్యలు తీసుకునేలా రామచందర్‌రావు ఆందోళన చేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిందని ఆయన మండిపడ్డారు. దీనిపై బీజేపీ అధిష్టానం పునరాలోచన చేయాలని సూచించారు. దళితులు, ఆదివాసీల పట్ల బీజేపీకి కనీస గౌరవం లేదని పేర్కొన్నారు.
Also Read: రాజాసింగ్‌పై పోటీ చేస్తా.. మాధవీలత సంచలన వ్యాఖ్యలు
అయితే తనను ఉద్దేశిస్తూ భట్టి చేసిన వ్యాఖ్యలపై రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరువుకు నష్టం కలిగించేలా భట్టి వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులు జారీ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు ఎవరు కారణం కాదంటూ కోర్టు తేల్చిన తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజం కాదని ఆయన ధ్వజమెత్తారు.


