‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం చేపట్టనున్న ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పిలుపునిచ్చారు. మే8వ తేదీ సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందన్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో చేపట్టిన సివిల్ మాక్‌డ్రిల్, అనంతర పరిస్థితులపై సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అధికారులతో సమీక్షించారు.
ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు. నగరంలోని రక్షణరంగ సంస్థల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. తెలంగాణ పర్యటనకు విచ్చేసిన వారికి తగిన రక్షణ కల్పించాలని, కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.