Lionel Messi Hyderabad tour details : కల నిజం కాబోతోంది! ఫుట్‌బాల్ ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఆ మాయగాడు, అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ.. మన హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టబోతున్నాడు. ‘ది గోట్ ఇండియా టూర్’లో భాగంగా, డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో ఆయన తన ఫుట్‌బాల్ విన్యాసాలతో అభిమానులను అలరించనున్నాడు. ఈ చారిత్రక ఈవెంట్‌లో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం బరిలోకి దిగనుండటం విశేషం. అసలు ఆ రోజు ఏం జరగనుంది? ఈ మెగా ఈవెంట్ షెడ్యూల్ ఏంటి?
‘ది గోట్ ఇండియా టూర్’లో భాగంగా, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నాడు. ఇందులో భాగంగా, డిసెంబర్ 13న ఆయన హైదరాబాద్‌కు రానున్నారు.
“భారతీయులు నాపై చూపే ప్రేమకు ధన్యవాదాలు. నా టూర్‌లో ఇప్పుడు హైదరాబాద్ నగరం కూడా చేరినందుకు సంతోషిస్తున్నాను. త్వరలో ఇండియాలో కలుద్దాం.”
– లియోనెల్ మెస్సీ
హైదరాబాద్‌లో మెస్సీ షెడ్యూల్ ఇదే : డిసెంబర్ 13న మెస్సీ హైదరాబాద్ పర్యటన అత్యంత ఆసక్తికరంగా సాగనుంది. 200 మంది సిబ్బందితో కూడిన బృందంతో, ప్రత్యేక విమానంలో మెస్సీ మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆయనకు ఆతిథ్యం, భద్రత కల్పిస్తోంది.
మీట్ అండ్ గ్రీట్: సాయంత్రం 5:30 నుంచి 6:15 గంటల వరకు, ఎంపిక చేసిన ప్రముఖులతో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉప్పల్‌లో సందడి (రాత్రి 7:00 – 9:00): సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. ఒక జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి, మరో జట్టుకు లియోనెల్ మెస్సీ సారథ్యం వహించనున్నారు.
మాస్టర్ క్లాస్: యువ ప్రతిభావంతులకు మెస్సీ ఫుట్‌బాల్ మెలకువలు నేర్పిస్తారు.
పెనాల్టీ షూటౌట్, మ్యూజికల్ కాన్సర్ట్: అనంతరం పెనాల్టీ షూటౌట్, సంగీత విభావరితో కార్యక్రమం ముగుస్తుంది. రాత్రికి నగరంలోనే బస చేసి, 14న ఉదయం ముంబైకి బయలుదేరతారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసే అవకాశం ఉంది.
ఇండిగో ఎఫెక్ట్ : వాస్తవానికి, మెస్సీ బృందం ఏర్పాట్ల పరిశీలన కోసం శుక్రవారమే హైదరాబాద్ రావాల్సి ఉంది. కానీ, ఇండిగో విమానాలు రద్దు కావడంతో వారి పర్యటన శనివారానికి వాయిదా పడింది. 2022 ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపి, ‘గోల్డెన్ బాల్’ గెలుచుకున్న మెస్సీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు, భాగ్యనగర క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

