Liquor Tenders in Telangana: రాష్ట్రంలో మద్యం టెండర్లకు ఈ సారి దరఖాస్తులు ఆశించని స్థాయిలో లేవని రికార్డుల ద్వారా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది టెండర్ల ద్వారా ఊహించని ఆదాయం వస్తుందన్న ఎక్సైజ్ శాఖకు ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. గతంలో రికార్డులు చూసుకుంటే వేల సంఖ్యలో అప్లికేషన్లు రాగా, ఈసారి వందలు కూడా దాటడం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దరఖాస్తు ఫీజులు పెరగడం, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రభావం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2023లో 8,128 అప్లికేషన్లు రాగా.. ఈసారి ఇప్పటివరకు 278 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక వనపర్తి జిల్లాలో 36 దుకాణాలకు 20 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. కాగా, 25 దుకాణాలకు ఒక్కటంటే ఒక్క టెండర్ కూడా రాకపోవడం గమనార్హం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 287 షాపులకు గాను 315 దరఖాస్తులు మాత్రమే రాగా.. గతేడాది ఇదే జిల్లాలో 10 వేల 734 మంది అప్లై చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 243 వైన్ షాపులకు ఇప్పటివరకు 411 దరఖాస్తులు కాగా, దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో మద్యం షాపులకు ఈ నెల 30తో గడువు ముగియనుండటంతో గత నెల 25న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 18వరకు టెండర్ల వేసుకునే అవకాశం ఉంది. ఇక కేవలం 5 రోజులే సమయం ఉన్నా.. దరఖాస్తుల ప్రవాహం మెల్లగానే కొనసాగుతోంది. కాగా, ఈ నెల 23న మద్యం షాపులకు డ్రా తీయనున్నారు.
కాగా లిక్కర్ టెండర్లకు వ్యాపారులు ఆసక్తి చూపకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని చర్చ నడుస్తోంది. టెండర్ ఫీజు గతంలో రూ. 2 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ. 3 లక్షలకు పెంచడం కారణమని తెలుస్తోంది. మద్యం షాపులకు దరఖాస్తులు మొదలైన సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇది కూడా ఓ కారణంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఆగిపోగా.. కోడ్ తొలిగిపోంది. దీంతో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


