మందుబాబులకు బ్యాడ్ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు రోజులు పాటు వైన్ షాపులు(Liquor Shops) బంద్ కానున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జంట నగరాల పరిధిలోని వైన్స్ షాపులు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా మద్యం దుకాణాల అనుమతులు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, ఎంఐఎం పోటీపడుతున్నాయి. బీజేపీ తరపున గౌతమ్ రావు, ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో పోటీకి అధికార కాంగ్రెస్, బీర్ఆఎస్ పార్టీలు దూరంగా ఉంటున్నాయి. ఈనెల 23న జరగనున్న ఎన్నికలకు 112 మంది ఓటర్లు కాగా.. ఇందులో 81 మంది కార్పొరేటర్లు కాగా.. 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల్లో 9 మంది ఎంపీలు, 15మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు.