Local body elections in Telangana: రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. బీసీ రిజర్వేషన్లపై ఇవాళ (బుధవారం) హైకోర్టు స్టే నిరాకరించిన నేపథ్యంలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. కాగా, బీసీ రిజర్వేషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా నోటిపికేషన్‍కు సంబధించి స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫున న్యాయవాదులు కోర్టును కోరారు. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు నోటిఫికేషన్‌ను యథావిధిగా ఇచ్చుకోవచ్చని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో, ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రేపు యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికాసేపట్లో జిల్లా కలెక్టర్‌లతో ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ హైకోర్టులో రేపటికి వాయిదా పడింది. మొదటి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీకు ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేస్‌లో 2 వేల 963 ఎంపీటీసీ స్థానాలకు.. 292 జడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అక్టోబర్ 9న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. అక్టోబర్ 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మొదటి విడతలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 23న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరగనుంది.
కొనసాగనున్న ఇద్దరు పిల్లల నిబంధన..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల అర్హతకు సంబంధించిన నిబంధనల్లో ఎలాంటి సడలింపు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా, అభ్యర్థులకు సంబంధించి గతంలో అమలులో ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ కొనసాగనుంది. పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 21 (3)లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరికి మించి ఎక్కువ పిల్లలుంటే అనర్హులు. అయితే.. ఒకే కాన్పులో కవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు అనగా కలవ పిల్లలు జన్మించి, దాంతో పిల్లల సంఖ్య ఇద్దరి కంటే పెరిగితే, ఆ కాన్పును ఒకే సంతానంగా పరిగణిస్తారు (చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం). మరోవైపు, ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ సంతానం లిమిట్ ఎత్తివేశారు. 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని టచ్ చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా దీన్ని మార్చలేదు. అయితే, ఈ నిబంధనలో మార్పులు చేసి మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరుతూ వస్తున్నాయి. అయినప్పటికీ, ఈసారి కూడా ఇది కార్యరూపం దాల్చలేదు.


