Local Body Elections:రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నది. అయితే, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 30వ తేదీలోగా ఎన్నికల నిర్వహణ అసాధ్యమే అనిపిస్తోంది. హైకోర్టు గడువు ముంచుకొస్తున్నా నోటిఫికేషన్ ఊసే లేదు. స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండడంతో పంచాయతీ, పరిషత్ ఎన్నికలు మరికొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి, గవర్నర్‌ల వద్ద పెండింగ్‌లో ఉన్న రిజర్వేషన్ల బిల్లులపై 30లోగా ఏమీ తేల్చకుంటే.. హైకోర్టుకు ఇదే కారణం చూపి ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు కోరే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సకాలంలో యూరియా ఇవ్వకుండా రాజకీయం చేస్తుండడంతో దాని ప్రభావం క్షేత్రస్థాయిలో రేవంత్ రెడ్డి సర్కార్‌పై కనిపిస్తున్నది. అకాల వర్షాలతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అపార నష్టం సంభవించింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను మరికొంత కాలం సాగదీసే ఆలోచనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. హైకోర్టు నుంచి మెట్టికాయలు పడకముందే ఓవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతుందని చెబుతూనే.. బీసీ ఆర్డినెన్స్, పంచాయతీరాజ్ యాక్ట్ 2018 చట్ట సవరణ బిల్లు పెండింగ్‌లో ఉండటంతో ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలుగుతుందనే బలమైన వాదనను హైకోర్టు ముందు వినిపించాలని సర్కార్ భావిస్తున్నది. మరో రెండు, మూడు నెలల గడువు కోరే అవకాశమున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఒ వైపు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటూనే.. మరోవైపు బీసీలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ ఎత్తుగడను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.
గడువు కోరనున్న ప్రభుత్వం
మూడ్ ఆఫ్ ది హౌస్‌ను పరిగణనలోకి తీసుకొని రెండు బిల్లులనూ ఆమోదించాలంటూ ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. ఆ రెండు బిల్లులనూ గవర్నర్ న్యాయ సలహా కోసం పంపినట్లు చెబుతున్నారు. హైకోర్టు విధించిన గడువులోగా స్థానిక ఎన్నికలను నిర్వహించాలంటే ఇప్పటికే గవర్నర్ ఈ రెండు బిల్లులపైనా నిర్ణయం తీసుకొని ఉండాలి. కనీసం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని హైకోర్టుకు విన్నవించాలన్నా.. గవర్నర్ సానుకూల నిర్ణయాన్ని ఈ నెల 20వ తేదీలోగా వెల్లడించాలి. కానీ, సవరణలతో తెచ్చిన రెండు బిల్లులను గవర్నర్.. కేంద్ర ప్రభుత్వ పరిశీలనకే పంపే అవకాశం ఎక్కువగా ఉందని న్యాయ పరిశీలకులు అంటున్నారు. బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెడితే.. ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు ఇవ్వాలంటూ హైకోర్టును ప్రభుత్వం కోరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఓవైపు వర్షాలతో సతమతం.. మరోవైపు యూరియా కష్టాలు
అకాల వర్షాలతో రాష్ట్ర ప్రజానీకం ఇంకా కోలుకోలేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అపార పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికలపై ప్రజలు అంతగా ఆసక్తి చూపే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా ప్రజల మూడ్ ప్రతికూలంగా ఉంటే తమకే ఇబ్బందికరమనే ఆలోచనలో అధికార పార్టీ ఉంది. మరోవైపు రాష్ట్రాన్ని యూరియా కొరత అట్టుడికిస్తున్నది. తమ పంటలను కాపాడుకునేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం అన్నదాతలు రోజుల తరబడి లైన్లలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సకాలంలో యూరియా సరఫరా చేయకుండా జాప్యం చేస్తుండగా.. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభావం పడింది. ఓవైపు వర్షాలతో పంటలు దెబ్బతినడం, మరో వైపు ఉన్న పంటలను కాపాడుకోవడంలో భాగంగా యూరియా కోసం పాట్లు పడటం లాంటి సున్నిత అంశం రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నది.
పోలీస్ బందోబస్తు కష్టమే
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి ఓటూ కీలకం కావడంతో అన్ని గ్రామాల్లో 90 శాతానికిపైగా పోలింగ్ శాతం నమోదవుతుంది. మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న ముసలివాళ్లు, ఇతర రాష్ట్రాలకు బతుకుదెరువు కోసం వెళ్లిన వాళ్లు సైతం ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే స్థానిక ఎన్నికల నిర్వహణ సమయంలోనే బందోబస్తు కత్తిమీద సాములా మారుతుంది. అందుకే ప్రతి జిల్లాలోనూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అప్పుడు బందోబస్తు ప్రక్రియ చేపట్టడం కొంత సులువవుతుంది. ఇప్పుడున్న 25 రోజుల వ్యవధిలో నోటిఫికేషన్ వేయడం, అభ్యర్థుల నామినేషన్, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు, ప్రచారానికి సమయం కేటాయించడం.. పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయడం కష్టమే. మరోవైపు ఈ నెల 21వ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలు ప్రారంభంకానుండడంతో బందోబస్తు విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. ఏదైనా జరిగితే ఎన్నికల నిర్వహణ సరిగా చేపట్టలేదనే అపవాదు కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకునే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు మరో రెండు, మూడు నెలల గడువు కావాలంటూ రాష్ట్ర సర్కార్ సాంకేతిక, చట్టపరమైన కారణాలు చూపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.


