Lokayukta: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘భూభారతి’ పోర్టల్ వేదికగా సాగుతున్న భారీ చలాన్ల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని కేటుగాళ్లు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని లోకాయుక్త (Lokayukta తీవ్రంగా పరిగణించింది. సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది.
ఉన్నతాధికారులకు నోటీసులు: భూభారతి పోర్టల్ స్కామ్‌పై సమగ్ర విచారణ జరపాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), రెవెన్యూ భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ (CCLA), స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ, మీసేవా కమిషనర్ మరియు జనగామ జిల్లా రిజిస్ట్రార్లకు నోటీసులు పంపింది. తక్షణమే విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
Also read-Telangana: వచ్చే నెల 14న మున్సిపల్ ఎన్నికలు?.. షెడ్యూల్‌కు సర్కారు సన్నాహాలు!
వందలు కట్టి.. లక్షల రశీదులు!: ఈ కుంభకోణం వెనుక ఒక పకడ్బందీ టెక్నికల్ ముఠా ఉన్నట్లు విచారణలో తేలింది. సాధారణంగా రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన చలాన్ మొత్తాన్ని ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారానే చెల్లించాలి. అయితే ఈ ముఠా థర్డ్ పార్టీ అప్లికేషన్లను వాడుతూ సాఫ్ట్‌వేర్‌లో మ్యానిపులేషన్ చేస్తోంది. అసలు చలాన్ రూ. 1 లక్ష ఉండాల్సి ఉంటే.. వీరు కేవలం రూ. 100 లేదా రూ. 500 మాత్రమే చెల్లిస్తున్నారు. టెక్నికల్ ఎడిటింగ్ ద్వారా బయటికి మాత్రం లక్ష రూపాయలు కట్టినట్లుగా కనిపించేలా నకిలీ రశీదులను సృష్టిస్తున్నారు. ఈ ఫేక్ చలాన్లతోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేస్తున్నారు.
జనగామలో గుట్టురట్టు: ఈ దందా మొదట జనగామ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కేవలం ఒక్క రోజులోనే 10 రిజిస్ట్రేషన్లకు సంబంధించి సుమారు రూ. 8,55,577 మేర ప్రభుత్వానికి గండి పడినట్లు అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ అక్రమ నెట్‌వర్క్ బయటపడింది. ఈ స్థాయి డేటా మ్యానిపులేషన్ కేవలం బయటి వ్యక్తులు చేయడం అసాధ్యమని, భూపరిపాలన కార్యాలయం (CCLA) లోని టెక్నికల్ విభాగం సిబ్బంది సహకారం ఉండి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఇంటర్నెట్ సెంటర్ల పాత్ర: యాదాద్రికి చెందిన ఒక ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు ఈ చలాన్లను ఎడిట్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం జనగామ తహసీల్దార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా విస్తరించి ఉండే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం వాటిల్లి ప్రమాదం ఉంది. దీంతో సర్కార్ సైతం ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

