Lovers Suicide case update: నేటి కాలంలో వివాహేతర సంబంధాలు సర్వ సాధారణమైపోతున్నాయి. అడ్డు చెబితే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. లేదంటే తమ ప్రాణాలు తీసుకోవడానికైనా ఆలోచించడం లేదు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే భార్య చంపించడం లాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాగే భార్యలను భర్తలు చంపుతున్న ఘటనలు కూడా వింటున్నాం. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రాగాల రిసార్ట్స్ లో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
ఈ ప్రేమ జంట ఆత్మహత్య కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఇద్దరు సొంత బావమరదలని పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రామంతాపూర్ లోని కేసీఆర్ నగర్ కి చెందిన సుధాకర్, గాంధీనగర్‌కు చెందిన సుష్మిత ఇద్దరూ సొంత బావమరదలు. అయితే వీరికి ఇంతకుముందే వేర్వేరుగా ప్రేమ వివాహాలు కూడా జరిగాయి.
అయినా కానీ కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సుష్మిత భర్త నల్గొండ జిల్లాలోని కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు. భర్త కేసు పెట్టడంతో మనస్తాపానికి గురైన సుష్మిత బావ సుధాకర్ వద్దకు వెళ్లిపోయింది. ఇద్దరు కలిసి రెండు రోజులుగా బీబీనగర్ మండలం కొండమడుగు రాగాల రిసార్ట్స్ లో రూమ్ అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
ఆదివారం మధ్యాహ్నం ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సుధాకర్.. తన బావ రంజిత్ కి సెల్ఫీ వీడియో కాల్ చేసి చనిపోతున్నామని చెప్పాడు. దీంతో కంగారుపడిన రంజిత్ పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్ నంబర్ ద్వారా లోకేషన్ గుర్తించిన పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఇద్దరు చనిపోయారు. తమ వివాహేతర సంబంధం కుటుంబసభ్యులకు తెలియడంతో అవమానానికి గురై చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈమేరకు స్పాట్ లో సూసైడ్ లెటర్ కూడా దొరికిందని వెల్లడించారు.