Heavy Rains Alert: ఓ వైపు చలికాలం సమీపిస్తోంది. ఇంకా వర్షాలు మాత్రం ఆగడం లేదు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో ఈ జిల్లాలకు భారీ వర్షసూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిన్న మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. మరి కొద్దిరోజుల్లో చలికాలం ప్రారంభం కానుంది. అయినా ఇంకా వర్షాల బెడద తప్పడం లేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. అక్టోబర్ 24వ తేదీన ఏర్పడనున్న అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా మరింతగా బలపడనుంది. అక్టోబర్ 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశముంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
ముఖ్యంగా ఏపీలోని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా పరిధిలో వచ్చే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. ఇప్పటికే ఈ జిల్లాలకు ఐఎండీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణలో కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చు. కామారెడ్డి, మహబూబ్ నగర్, గద్వాల్, నారాయణ పేట్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
అంటే ఈ జిల్లాల్లో అక్టోబర్ 23 నుంచి భారీ వర్షాల సూచన ఉంది.
ఇక అక్టోబర్ 19వ తేదీన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సిద్ధిపేట, భువనగిరి, మెదక్, కామారెడ్డి, గద్వాల్ జిల్లాల్లో అక్టోబర్ 19, 20 తేదీల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు.
వర్షాలు పడేటప్పుడు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా టవర్లు, చెట్లు, పొలాల్లో సంచరించవద్దంటున్నారు. వర్షాల కారణంగా చలి ప్రభావం గట్టిగా ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది.


