Land Lucky Draw: పుట్టిన పది నెలలకే ఆ ఇంట్లో కనక వర్షం కురిపించింది ఆ చిట్టి తల్లి. అందుకే ఆడపిల్లను ఇంటికి లక్ష్మీదేవిగా భావిస్తారు. తల్లి కంటే ఎక్కువగా తండ్రే తన గారాల కూతురిపై ప్రేమను చూపిస్తుంటారు. ఇక, ఇప్పుడు తన కూతురు కారణంగా రూ. లక్షల ఖరీదైన బహుమతి ఇంటికి రావడంతో ఆ తండ్రి సంతోషానికి హద్దులు లేవు. ఇంతకీ కథేంటి అనుకుంటున్నారా..
సాధారణంగా వినాయకచవితి, విజయదశమి పండుగల్లో గణేషుడిని, కనకదుర్గమ్మ అమ్మవార్లను నిలబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్ని చోట్ల లక్కీ డ్రాలు నిర్వహించడం చూస్తుంటాం. బైక్, స్కూటీ, కారు ఇలా వీటితో పాటు భూమిని కూడా లక్కీ డ్రాలో పెడతారు. ఒక్కో కూపన్‌కు రూ. 300, రూ. 500 లేదా ఆ పైన ఇలా ధర నిర్ణయిస్తారు. ఫలానా తేదీ వరకు లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. గడువు ముగిసిన తర్వాత ఆ లక్కీ డ్రాలో పేరు వచ్చిన వ్యక్తి విజేత, అదృష్టవంతుడు. చాలా తక్కువ మొత్తంలో రూ. లక్షల విలువ చేసే వస్తువు, లేదా భూమిని సొంతం చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి అదృష్టమే ఓ కుటుంబాన్ని వరించింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-ration-card-ekyc-deadline/
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో రూ. 500లకే ఓ కుటుంబం రూ.16 లక్షల విలువైన ప్లాట్ సొంతం చేసుకుంది. చౌటుప్పల్‌కి చెందిన రామబ్రహ్మం తనకి చెందిన 66 గజాల ఇంటి స్థలం అమ్మేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా బేరం కుదరలేదు. దీంతో వినూత్న ఆలోచన చేసి లక్కీ డ్రా పద్దతి పెట్టాడు. అయితే ఈ విధానం రాష్ట్రంలో చట్టబద్ధం కాకున్నా.. ల్యాండ్ ఓనర్ వేరే దారి లేక ఇలా ప్లాన్ వేశారు. కూపన్‌కు రూ. 500 ధర నిర్ణయించారు.
దీంతో స్థానికులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు.. క్యూ కట్టారు. అయితే మార్కెట్ ప్రకారం ల్యాండ్ విలువ రూ.16 లక్షలు ఉంటుంది. ఓనర్ 3,000 కూపన్లు ముద్రించగా.. వాటిని కొనుగోలు చేసిన వారు దానిపై తమ వివరాలు రాసి ఆ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలో వేసేలా ఫ్లెక్సీలు పెట్టారు. నవంబరు 2న లక్కీడ్రా తీస్తానని ఓనర్ ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ సమాచారం వైరల్ కావడంతో.. చాలా మంది కూపన్లు కొనుగోలు చేశారు.
ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి చెందిన శంకర్ తన కుటుంబ సభ్యుల నలుగురి పేర్ల మీద 4 కూపన్లు కొని బాక్సులో వేశారు. గడువు ముగిశాక.. ఆదివారం కూపన్లు కొనుగోలు చేసిన వారి సమక్షంలోనే లక్కీ డ్రా తీసే కార్యక్రమం నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో శంకర్ కుమార్తె హన్సిక(10నెలలు)న పేరు రావడంతో వారిని అదృష్టం వరించినట్లయింది. 2307 సీరియల్ నెంబర్‌తో కూపన్ కొనుగోలు చేసిన హన్సిక తల్లిదండ్రులకు నిర్వాహకుడు ఫోన్ చేసి విషయం చెప్పడంతో.. వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
శంకర్ కోరిన సమయంలో రిజిస్ట్రేషన్ చేస్తానని ల్యాండ్ ఓనర్ ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో రూ. 500 చొప్పున దాదాపు 3,600 కూపన్లు అమ్ముడు పోయాయని, ఆశించిన దానికన్నా రూ.3 లక్షలు అదనంగా వచ్చాయని రామబ్రహ్మం హర్షం వ్యక్తం చేశారు. అయితే హన్సిక పుట్టిన ఏడాది లోపలే వారికి లక్కీ డ్రాలో రూ. 16 లక్షల విలువైన భూమి దక్కడంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు.


