Srikanth Iyengar Issue: ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీపై చేసిన అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA)’ అధ్యక్షుడు మంచు విష్ణుకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
శ్రీకాంత్ అయ్యంగార్ కేవలం పబ్లిసిటీ కోసమే చరిత్రను వక్రీకరించారని, జాతిపిత సిద్ధాంతాన్ని, ఆయనను ఆరాధించే కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను అంగీకరించబోమని, తక్షణమే శ్రీకాంత్ అయ్యంగార్ ‘మా’ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో కూడా పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, సినీ పరిశ్రమలోని పెద్దలు, ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి అగ్రనటులు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించాలని బల్మూరి వెంకట్ విజ్ఞప్తి చేశారు.
‘మా’ జనరల్ సెక్రటరీ శివ బాలాజీ ఈ విషయంపై స్పందిస్తూ… “వాక్ స్వాతంత్య్రం పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. మాకు క్రమశిక్షణ కమిటీ ఉంది. దానిలో ఈ అంశంపై కూలంకషంగా చర్చించి, త్వరలోనే శ్రీకాంత్ అయ్యంగార్‌పై తగిన కఠిన చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు. వరుస ఫిర్యాదులు, క్రమశిక్షణా చర్యల హెచ్చరికల నేపథ్యంలో, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌కు సినీ అవకాశాలు తగ్గడంతో పాటు, ‘మా’ నుంచి సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


