Madhavi Latha Comments on Rajasingh: బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ఆ పార్టీ నాయకురాలు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్‌గా ఉన్న రాజాసింగ్‌ను ఎమ్మెల్యేగా చేసిందా బీజేపీనే కదా అని తెలిపారు. అలాంటి పార్టీని పట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా అని ఫైర్ అయ్యారు. పార్టీ మద్దతు లేకుండానే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారా అని ఆమె ప్రశ్నించారు. సనాతన ధర్మ పరిరక్షకుడిని చెప్పుకునే రాజాసింగ్.. మహిళలను, ఇతర మతాల వారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇదేనా అసలైన సనాతన ధర్మం అని ప్రశ్నించారు.
గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తనను హైదరాబాద్ ఎంపీగా నిలబడితే రాజాసింగ్ వ్యంగ్యంగా మాట్లాడారని గుర్తుచేశారు. ఎంపీ అభ్యర్థిగా మహిళలే దొరికారా.. మగాళ్లు దొరకలేదా అని హేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎంపీ ఎన్నికల్లో తనకు రాజాసింగ్ సహకరించలేదని.. తన ఓటమికి ఆయన వైఖరే కారణమని మాధవీలత ధ్వజమెత్తారు. కానీ గోషామహల్‌లో ఆయన కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని.. ఒక్కరు వెళ్లిపోయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదంటూ ఘాటు విమర్శలు చేశారు. గోషామహల్‌లో ఉప ఎన్నిక వస్తే రాజాసింగ్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అలాగే జూబ్లీహిల్స్‌లోనూ నిలబడేందుకు సిద్ధమని వెల్లడించారు.
కాగా ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఎంపిక ప్రక్రియ నేపథ్యంలో పార్టీ వైఖరి నచ్చని రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తనను అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆయన ఆగ్రహించారు. పార్టీలో కష్టపడే కార్యకర్తలు, నాయకులకు విలువ ఉండటం లేదని వ్యాఖ్యానించారు. కొంతమంది నాయకులు చీకటి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి నాయకులను పార్టీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజాసింగ్ రాజీనామాను పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా ఆమోదించారు. దీంతో రాజాసింగ్ ఏ పార్టీలోకి వెళ్తారో అనే చర్చ మొదలైంది.
Also Read: కాంగ్రెస్ పార్టీలోకి కవిత..అతి త్వరలో: తీన్మార్ మల్లన్న
మరోవైపు మాధవీలత 2024 ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమె హిందూత్వ ఎజెండా ఎత్తుకుని కొంతమేరకు సక్సెస్ అయ్యారు. అయితే ఎన్నికల అయిపోయిన నాటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. దాదాపు సంవత్సరం తర్వాత మళ్లీ ఇప్పుడు రాజాసింగ్ రాజీనామాతో రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. గోషామహల్‌లో రాజాసింగ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆమె ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.


