విజయం అనేది అనుకున్నంత సులువు కాదని, నిరంతర సాధనతో నే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతామని జిల్లా కలెక్టర్ శశాంక ఆశాభావం వ్యక్తం చేశారు. ఐ.డీ.ఓ.సి.లోని సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులకు స్వచ్ఛ సర్వేక్షన్ పై అవగాహన కార్యక్రమాన్ని సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ఉత్తమ గ్రామ పంచాయతీ లుగా గెలుపొందాలని అనుకుంటే సరిపోదని దానికి ప్రణాళిక ఉండాలన్నారు. ముందస్తుగా ప్రజల్లో అవగాహన అత్యంత ప్రధాన్యమని, ప్రజల చైతన్యం తోనే సాధ్యమవుతుందన్నారు. జిల్లా స్థాయిలో అధ్యయన బృందం ఏర్పాటు చేయాలని, అంశాల వారీగా గ్రామాలలో అభివృద్ధి పురోగతిని లెక్కించాలన్నారు. మండల స్థాయి బృందాన్ని ఏర్పాటు చేస్తూ పోటీతత్వాన్ని నెలకొల్పాలన్నారు.
రోజువారీ పనుల్లో పారిశుధ్యం మెరుగుపై ప్రధాన దృష్టి పెట్టాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సలహాలు, సూచనలు ఇస్తూ మార్గనిర్దేశనం చేయాలన్నారు. బ్లాక్ వాటర్, గ్రేవ్ వాటర్ కు అర్ధం చెప్పాలని, వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనిటీ గుంతలు, ఇంకుడు గుంతల ఉపయోగం వివరిస్తూ వాటిని నిరంతర పరిశీలన చేయాలన్నారు. కమ్యూనిటీ గుంతకు 12,760-00, సోక్ పిట్ కు 6,500 మంజూరు చేస్తూ నిర్మించడమే గాక వాటి వినియోగించే విధానం తెలపాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. 4 లేక 5 పంచాయతీలను క్లస్టర్ గా ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలు మండల స్థాయి అధికారులకు కేటాయించాలన్నారు. అభివృద్ధిపై ప్రచారం చేపడుతూ ఫొటోస్, వీడియోలు తీయించాలని అన్నారు. సమ్మర్ స్పోర్ట్స్ మొదలు పెట్టాలని, ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలన్నారు.
గ్రామాభివృద్దే ధ్యేయంగా పనిచేస్తూ పరిశుభ్రమైన గ్రామలుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జెడ్పి సీఈవో రమాదేవి, డిఆర్డిఏ పిడి సన్యాసయ్య, జిల్లా పంచాయతీ అధికారి ధన్ సింగ్, జడ్పీ ఉప సీఈవో నర్మద, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు తదితరులు పాల్గొన్నారు.