తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ‘జాగో ముసల్మాన్ కమిటీ’ కన్వీనర్ అహ్మద్ ఖాన్, ప్రముఖ మోటివేటర్ బ్రదర్ సిరాజుల్ రెహ్మాన్ ల ఆధ్వర్యంలో జాగో ముసల్మాన్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి తెలంగాణ లోని ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, ముస్లింలలో పోలింగ్ రోజు ఓటింగ్ శాతం తక్కువగా వుంటుందని, ఓటింగ్ శాతం పెంచడానికి జాగో ముసల్మాన్ కమిటీ తెలంగాణ అంతటా పర్యటించి, ముస్లింలలో ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేసే విషయం గురించి వివరించామన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి ఈ నెల 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ ముస్లిం డిక్లరేషన్ పేరిట ముస్లింల అభ్యున్నతికి పలు రకాల పథకాలు ప్రకటించనుందని, “తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకై కర్నాటక ముస్లింల తరహాలో తెలంగాణ ముస్లింలు కూడా కష్టపడి పార్టీని గెలిపించాలని కోరారన్నారు. అన్ని వర్గాల ఆశీర్వాదంతో త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాగో ముస్లిం కమిటీ కన్వీనర్లు షమీం సుల్తాన్, అఖిల్ బేగ్, మహమ్మద్ అక్సర్, అక్రమ్, అబ్దుల్ రహీం, తదితరులు పాల్గొన్నారు.