Mahabubnagar Dry Port: ఒకప్పుడు వలసలకు చిరునామాగా నిలిచిన పాలమూరు దశ తిరగనుందా..? సముద్రమే లేని చోట ఓడరేవు కార్యకలాపాలకు కేంద్రం కానుందా…? అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వందల ఎకరాల విస్తీర్ణంలో, వేల మందికి ఉపాధినిచ్చే బృహత్తర ‘డ్రై పోర్టు’ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అడ్డాకుల మండలం గుడిబండ కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ఈ మహా ప్రణాళికతో పాలమూరు పారిశ్రామిక పటంలో కీలక స్థానానికి చేరనుంది. అసలు ఈ డ్రై పోర్టు అంటే ఏమిటి…? దీనివల్ల పాలమూరు దశ ఎలా తిరగబోతోంది..? ఈ ప్రతిపాదన వెనుక ఉన్న వ్యూహమేంటి..?
ప్రతిపాదనకు తొలి అడుగు.. అధికారుల పరిశీలన : మహబూబ్‌నగర్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో భాగంగా, అడ్డాకుల మండలం గుడిబండలో డ్రై పోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని గుడిబండ శివారు సర్వే నంబర్ 118లో ఉన్న సుమారు వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఈ ప్రాజెక్టు కోసం గుర్తించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) అధికారుల బృందం, స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డితో కలిసి ఈ స్థలాన్ని పరిశీలించారు. ప్రాజెక్టుకు ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలంగా ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ALSO READ:https://teluguprabha.net/telangana-news/siddipet-foreign-job-fraud-kyrgyzstan/
డ్రై పోర్టు అంటే ఏమిటి – ప్రయోజనాలేంటి : సముద్ర తీర ప్రాంతాలలో ఉండే ఓడరేవులకు (సీ పోర్టు) అనుబంధంగా, దేశం లోపలి భాగంలో ఏర్పాటు చేసేవే ‘డ్రై పోర్టులు’. ఇవి ఒక రకంగా “లోతట్టు ఓడరేవులు”.
కార్యకలాపాలు: ఓడరేవుల నుంచి భారీ కంటైనర్లలో వచ్చే సరుకులను ఇక్కడ నిల్వ చేస్తారు. ఇక్కడి నుంచే కస్టమ్స్ క్లియరెన్స్ వంటి ప్రక్రియలు పూర్తి చేసి, రోడ్డు, రైలు మార్గాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా చేరవేస్తారు. అలాగే, ఎగుమతి చేసే సరుకులను ఇక్కడకు చేర్చి, కంటైనర్లలో నింపి నేరుగా ఓడరేవులకు పంపిస్తారు.
ప్రయోజనాలు: దీనివల్ల ఓడరేవులపై రద్దీ తగ్గుతుంది. ఎగుమతి, దిగుమతులకు పట్టే సమయం, ఖర్చు గణనీయంగా ఆదా అవుతాయి. వాణిజ్య కార్యకలాపాలు వేగవంతమవుతాయి.
గుడిబండనే ఎందుకు : వ్యూహాత్మకంగా గుడిబండ ప్రాంతం డ్రై పోర్టు ఏర్పాటుకు అత్యంత అనువైనదిగా అధికారులు గుర్తించారు.
రహదారుల అనుసంధానం: జాతీయ రహదారి-44కు (హైదరాబాద్-బెంగళూరు) కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటకలోని రాయచూర్‌కు వెళ్లే జాతీయ రహదారి-167 కూడా దీనికి సమీపంలోనే ఉంది.
రాష్ట్రాల కూడలి: తెలంగాణ నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరుకు రవాణా చేయడానికి ఇది కీలకమైన కూడలి.
రైలు మార్గం: మహబూబ్‌నగర్, మదనాపురం, దేవరకద్ర ప్రాంతాల నుంచి రైలు మార్గం కూడా అందుబాటులో ఉండటం మరో పెద్ద ప్రయోజనం.
వలసలకు అడ్డుకట్ట.. ఉపాధికి భరోసా : “పాలమూరు బిడ్డ బతుకు కోసం ముంబయికి వలసపోవాల్సిన దుస్థితికి చరమగీతం పాడాలన్నదే మా లక్ష్యం,” అని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. “స్థానిక యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈ డ్రై పోర్టు ఆలోచన చేస్తున్నాం. దీని ఏర్పాటుకు గట్టిగా కృషి చేస్తాం,” అని ఆయన స్పష్టం చేశారు.


