ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఇకపై ఒక్క ఇల్లు కూడా కేటాయించమంటూ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రధానమంత్రిని గౌరవిస్తామని తెలిపారు. దేశం కోసం ఇందిరమ్మ త్యాగం ముందు మీరు, మీ మోడీ ఎంత అని ప్రశ్నించారు. బండి తక్షణమే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ చేతల ప్రభుత్వం అనడానికి దావోస్ పెట్టుబడులే నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత రికార్డు స్థాయిలో రూ 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. పదేళ్లు కేసీఆర్(KCR)కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా సీఎం రేవంత్(CM Revanth Reddy), మంత్రుల హయాంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో పాలన సాగుతోందని తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
కాగా పీఎం ఆవాస్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు ‘ఇందిరమ్మ’ పేరు పెడితే ఒప్పుకునే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో పెట్టకపోతే ఉచిత బియ్యం ఎందుకివ్వాలని ప్రశ్నించారు.