ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అరెస్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించిన విషయం విధితమే. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడేనని తెలిపారు. అయినా కానీ చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. చట్టం ఎవరి చుట్టం కాదని వ్యాఖ్యానించారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందన్నారు. అలాగే ఆమె కుమారుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడని.. దీనికి ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, కాంగ్రెస్‌కు విడదీయరాని బంధం ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృషి వల్లే తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వచ్చిందని వెల్లడించారు. సినీ స్టూడియోల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే భూములిచ్చిందని చెప్పుకొచ్చారు.