Malla Reddy: తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ అన్నట్లుగా టార్గెట్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. తెరాస నేతలపై ఐటీ దాడులతో మా సత్తాచూపిస్తామంటూ బీజేపీ పెద్దలు అంటుంటే.. మేం చూస్తూ ఊరుకోం అన్నట్లుగా సీఎం కేసీఆర్‌సైతం కాలుదువ్వుతున్నారు. వీరి మధ్య గొడవ కాస్త వ్యక్తిగతంగా మారి.. తెరాస నేతల ఇళ్లపై ఐటీదాడులకు కారణమవుతుంది. ఇప్పటికే తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రి గంగుల కమలాకర్ వ్యాపారాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో తన ప్రసంగాలతో నవ్వులుపూయించే మంత్రిగా పేరున్న మల్లారెడ్డి ఇల్లు, అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు.
మంగళవారం తెల్లవారు జామున 50 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. మల్లారెడ్డి ఇద్దరు కుమారులు, అల్లుడు, ఆయన వ్యాపారంలో భాగస్వాములు, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. బుధవారంసైతం ఈ సోదాలు కొనసాగాయి. ఉదయం ఓపక్క ఐటీదాడులు కొనసాగుతున్న సమయంలోనే మల్లారెడ్డి పెద్ద కుమారుడికి ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. తన కొడుకును చూసేందుకు వెళ్తున్న మల్లారెడ్డిని ఐటీ అధికారులు అడ్డుకోవటంతో మంత్రి వారితో వాగ్వివాదంకు దిగారు. ఐటీ అధికారులుసైతం లైట్ తీసుకోవటంతో మల్లారెడ్డి ఆస్పత్రి వద్దకు వెళ్లారు. కానీ కొడుకును చూసేందుకు లోపలికి అనుమతి ఇవ్వకపోవటంతో మంత్రి ఆగ్రహంతో ఊగిపోయాడు.
మేమేమైనా దొంగలమా? నా కొడుకు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉంటే చూసేందుకుకూడా అనుమతించరా? అంటూ ఐటీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, మల్లారెడ్డి వ్యాపారాలపై ఐటీ అధికారులు దాడులను ఒకటిరెండు రోజుల్లో ప్లాన్ చేసింది కాదట. గత ఆర్నెళ్లుగా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి వ్యాపార లావాదేవీలపైనా, వారి కుటుంబ సభ్యుల అకౌంట్‌లలో నగదు వివరాలపైనా ఆరాతిస్తూ వచ్చారట. అంతేకాదు.. మేం రియల్ ఎస్టేట్ వ్యాపారులం అని, మా భూమిని కొనుగోలు చేయాలంటూ మంత్రి వద్దకు ఐటీ అధికారులు గతంలో వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిని బట్టి చూస్తే మల్లారెడ్డిపై ఐటీ అధికారులు పక్కా ప్రణాళికతోనే దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో మంగళవారం రాత్రి వేర్వేరు చోట్ల దాదాపు రూ.4 కోట్ల నగదును, ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన సీడీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బుధవారంసైతం కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మొత్తానికి.. తన ప్రసంగాలతో నవ్వులు పూయించే మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులతో తిప్పలు తప్పేలా కనిపించడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారగా, ఆయన వర్గీయులను కలవరానికి గురిచేస్తుంది.