Saturday, November 15, 2025
HomeతెలంగాణMallanna Sagar : ఆస్తులు లాగారు.. అవస్థలు మిగిల్చారు! మల్లన్నసాగర్ నిర్వాసితుల కన్నీటి గాథ!

Mallanna Sagar : ఆస్తులు లాగారు.. అవస్థలు మిగిల్చారు! మల్లన్నసాగర్ నిర్వాసితుల కన్నీటి గాథ!

Mallanna Sagar project compensation issues: ప్రాజెక్టుల పేరుతో భూములు తీసుకున్నారు.. బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు.. కానీ ఏళ్లు గడుస్తున్నా ఆ హామీలు నీటిమూటలయ్యాయి, ఆ బతుకులు అగమ్యగోచరంగా మారాయి. ఇది మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ప్రాజెక్టుల కింద సర్వం కోల్పోయిన నిర్వాసితుల కన్నీటి గాథ. పరిహారం కోసం కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, చివరికి కలెక్టరేట్ ప్రాంగణంలోనే కన్నుమూసిన రైతు బాలకిష్టయ్య విషాదం, ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది..? వేలాది కుటుంబాల వెతలకు కారణమెవరు..?

- Advertisement -

ఏళ్లు గడుస్తున్నా.. అందని పరిహారం : రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద భూములు, ఇళ్లు కోల్పోయిన వేలాది కుటుంబాలు నేటికీ పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయి.

మల్లన్నసాగర్ కష్టాలు: సిద్దిపేట జిల్లా వెంకటాపూర్, తడ్కపల్లి గ్రామాల్లో 87 మంది రైతుల నుంచి 170 ఎకరాల భూమిని కాల్వల కోసం తీసుకున్నా, 2019 నుంచి నేటికీ పరిహారం అందలేదు. వేములఘాట్‌లో ఇళ్లు, స్థలాలు ఇచ్చినా, 18 ఏళ్లు నిండిన యువతకు ప్యాకేజీ అందక నిరీక్షిస్తున్నారు.

కొండపోచమ్మ సాగర్ గోస: బైలాంపూర్, మామిడ్యాల వంటి గ్రామాల్లో 175 మంది నిర్వాసితులకు ఇంకా పూర్తి పరిహారం అందాల్సి ఉంది.

అనంతగిరి (అన్నపూర్ణ) నిర్వాసితులు: కోచగుట్టపల్లి గ్రామం ముంపునకు గురై ఐదేళ్లు గడిచినా, 50 కుటుంబాలకు ఇంకా ఆర్&ఆర్ ప్యాకేజీ కింద ఇళ్ల పట్టాలు రాలేదు. 11 మందికి నష్టపరిహారమే దక్కలేదు.

గౌరవెల్లి ఘోష: పరిహారం పెంపు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన గౌరవెల్లి నిర్వాసితుల్లో 24 మందికి, 18 ఏళ్లు నిండిన 139 మందికి ప్యాకేజీ అందాల్సి ఉంది.

బాధితుల ఆవేదన.. వారి మాటల్లోనే….

“మా ఊరు పల్లెపహాడ్ మల్లన్నసాగర్‌లో మునిగిపోయింది. రూ.7.50 లక్షల ప్యాకేజీ, ఇంటి కోసం రూ.5.04 లక్షలు రావాలి. నాలుగేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, ఇప్పటికీ దిక్కులేదు.”
– పి. మల్లమ్మ, పల్లెపహాడ్

“కొండపోచమ్మ సాగర్‌లో అర ఎకరం భూమి, ఇల్లు కోల్పోయాను. రూ.7.50 లక్షల ప్యాకేజీ రావాలి. నా పేరు మొదటి జాబితాలోనే ఉంది, అయినా డబ్బులు ఇవ్వడం లేదు.”
– ఎడ్ల సత్తయ్య, మామిడ్యాల

చెల్లని చెక్కులు.. ఆవేదనతో మృతి : మల్లన్నసాగర్‌లో ఇల్లు, రెండెకరాల భూమి కోల్పోయిన ఓ నిర్వాసితుడి కథ అత్యంత విషాదకరం. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం చెక్కుల్లో రెండు (రూ.7.50 లక్షలు, రూ.5 లక్షలు) చెల్లకపోవడంతో, ఆ ఆవేదనతోనే ఆయన అనారోగ్యం పాలై ఇటీవల మృతి చెందారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రాజెక్టుల కింద భూములు సేకరించిన అధికారులు, పరిహారం చెల్లింపులో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమ బతుకులతో చెలగాటమాడుతున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి, తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad