మల్లాపూర్ మండల సాధారణ సమీక్ష సమావేశంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జగదీష్ అధ్యక్షతన నిర్వహించారు. పలు శాఖలపై సమీక్షించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ హాజరయ్యారు.
సమావేశంలో అధికారులు తెలిపిన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రత్యేక అధికారులు గ్రామాలకు వెళ్లిన దాఖలాలు లేవని, గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే బాధ్యత అధికారులకు లేకుండా పోయిందని గ్రామాల్లో శానిటేషన్ సరిగా జరగకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని దానికి పూర్తి బాధ్యులు ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులని ఆరోపించారు. అధికారులు, రాజకీయ నాయకులకు భయపడాల్సిన అవసరం లేదని, రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని గ్రామాల్లో పర్యటించి గ్రామాల అభివృద్ధికి అధికారులు తోడ్పడాలని ఎన్నికలు ముగిసి పది నెలలు అవుతున్నా ఎప్పటికీ శిలాఫలకాలపై ముసుగులు తొలగించ లేదని అధికారుల అలసత్వం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని, ఇకనైనా మేల్కొని శిలాఫలకాలపై ఉన్న ముసుగులను తొలగించాలని అధికారులను కోరారు.
రైతు రుణమాఫీ సక్రమంగా జరగడంలేదని రైతులు అధికారుల చుట్టూ, బ్యాంకర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడదని వ్యవసాయ అధికారులు రైతులనూ ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. గత పది నెలల కాలంలో తెలంగాణ పదేళ్లు వెనక్కి పోయిందని, అభివృద్ది విషయంలో ఎవరు అలసత్వం వహించద్దని, ప్రజల డబ్బులతో జీతం తీసుకుంటున్న నాతోపాటు, అధికారులంతా ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేయాలని కోరారు. ఇకనైనా అధికారులు మేల్కొని గ్రామాల్లోకి వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జగదీష్ ఎమ్మార్వో వీర్ సింగ్ , పంచాయతీ రాజ్ డి ఈ రమణ రెడ్డి, సిరిపూర్ పాక్స్ చైర్మన్ అంజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.