తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. రెండు లక్షల లోపు రుణాలు కొంత మందికి అయినా ఇంకా చాలా మంది రైతులు రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డులో పేరు లేకపోవడం, రెండు లక్షల కన్నా ఎక్కువ రుణం ఉన్న రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కనీసం దీపావళి కానుకగా రైతులకు శుభవార్త చెబుతారా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం మండల వ్యాప్తంగా 540 మంది రైతులను వ్యవసాయ శాఖ అధికారులు కుటుంబ నిర్ధారణ పూర్తి చేసి ప్రభుత్వానికి డేటా పంపించగా రైతులు తమ రుణం మాఫీ అవుతుందేమో అని ఎదురుచూస్తున్నారు. సంబంధిత అధికారులు తెలిపిన ప్రకారం ప్రభుత్వం స్పందించి రైతుల వివరాలతో రుణమాఫీ లిస్టు పంపిస్తేనే రైతులకి రుణమాఫి జరుగుతుందని, లేకపోతే ప్రభుత్వం చేసే వరకు ఆగాల్సిందే అని చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు రుణమాఫీ జరుగుతుందో, లేక ప్రభుత్వం ఇలాగే నాన్చుడు ధోరణి అవలంభిస్తోందో అంతుచిక్కటం లేదు.
రుణమాఫీ కోసం ఆశతో ఎదురు చూస్తున్నా..
“కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు న్యాయం చేస్తుందని ధీమాతో రైతులు ఉన్నారని, రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నామని కానీ మా ఆశలన్నీ అడియాసలు అయ్యేలా ఉన్నాయని ప్రభుత్వం ఇకనైనా మేల్కొని రుణమాఫీ వేయాలని కోరుతున్నాం”. –కాటీపల్లి వినోద్, రుణమాఫి కాని రైతు
ప్రభుత్వాలు మారిన రైతు తలరాత మారడం లేదు..
“రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని, తమ కుటుంబంలో లబ్ధిదారులుగా ఉన్నా తమ కుటుంబంలో ఇప్పటికీ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని ప్రభుత్వం మాటలతో కాకుండా చేతల్లో చూపించి తొందరగా రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరుతున్నాం”. -ప్రశాంత్, రుణమాఫీ కాని యువరైతు
ప్రభుత్వానికి నివేదిక అందించాం
రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు కుటుంబ నిర్ధారణ చేసి రెండు లక్షల రుణమాఫీ కాని రైతుల వివరాలను ప్రభుత్వానికి అందించామని ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తున్నామని, ప్రభుత్వ నిర్ణయం మేరకు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని..మల్లాపూర్ మండల వ్యవసాయ అధికారిణి లావణ్య తెలుగుప్రభకు వివరించారు.