వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చి, ప్రారంభించకుండానే ఏఎంసీ చైర్మన్ అధికారులు వెనుతిరిగిన ఘటన వాల్కొండ గ్రామంలో చోటుచేసుకుంది. వాల్గొండ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడ్పుల పుష్పలత నర్సయ్య , వైస్ చైర్మన్ నారాయణ, ఏపీఏం దేవరాజు, ఐకేపీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో చేసేది ఏమి లేక
వెనుతిరిగారు.
కొత్తగా ఎన్నుకున్న మహిళ సభ్యులకు సెంటర్ ప్రారంభం సమాచారం లేకపోవడం, పాత సభ్యులకూ సీసీ సమాచారం అందించడం ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్టు స్థానికుల సమాచారం. తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని, పాతవారికి సీసీ సమాచారం అందించారని కొత్త ఎన్నికైన సభ్యులు సీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్కొండ గ్రామంలో ఐకెపి సెంటర్ గత కొన్ని ఏళ్లుగా మహిళా సంఘల ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రతి సంవత్సరం గ్రామానికి చెందిన మహిళా సంఘాల నుండి ముగ్గురు మెంబర్ల ఆధ్వర్యంలో సెంటర్ నిర్వహణ బాధ్యతలు చూస్తారు. ఈ సంవత్సరం సెంటర్ నిర్వాహణ కోసం మహిళా సంఘాల నుండి లోంక కళ, తిరుమల లక్ష్మి, సీసీ లక్ష్మి రాజం, గడ్డం. నిఖితలను మహిళా సంఘం సభ్యులు అందరూ కలిసి ఎంచుకోగా, గత సంవత్సరం సెంటర్ నిర్వహించిన వారు తాము మళ్లీ చేస్తామని అనడంతో పాత, కొత్త వాళ్ళ మధ్య చిచ్చురేపింది.
పాతోళ్లకే పెద్ద పీటా?
పాత వాళ్లకి సిసి వత్తాసు పలుకుతున్నారని, కొత్త వాళ్లను మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని, పాత వాళ్లకే ప్రాధాన్యత ఉంటుందని సీసీ అన్నారని, కొత్త మహిళా సంఘం తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఐకెపి ఎపిఎం దేవరాజును వివరణ కోరగా, కోనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన మాట వాస్తవం అని, సమన్వయ లోపం వల్ల ఏర్పాట్లు చేయలేదని, అందుకే ఈ సంఘటన జరిగిందని, గ్రామంలోని మెజార్టీ మహిళా సంఘాలు నిర్ణయించిన వారికి బాధ్యతలు అప్పగిస్తామని, తొందరలోనే ఐకెపి సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు.
15 రోజులుగా వెయిటింగ్..
గత 15 రోజుల నుండి రైతులు సెంటర్లో ధాన్యం పోసి సెంటర్ ప్రారంభానికి ఎదురు చూస్తున్నారు. బుధవారం ప్రారంభం అవుతుంది అని అనుకున్నంతలోనే ప్రారంభానికి వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు వెనుతిరిగి వెళ్లడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత కొత్త మహిళా సంఘాల అధ్యక్షుల గొడవ సమస్య సమసిపోయి సెంటర్ ప్రారంభమవుతుందో లేదో వేచి చూడాలి.