వేసవికాలం ముగిసి వర్షాకాలం ప్రారంభం అయినా చెదురుమొదురు వర్షాలు మినహా భారీ వర్షాలు ఇప్పటికీ కురవలేదు. చెదురు మొదురు వర్షాలకు మండల వ్యాప్తంగా రైతులు మొక్కజొన్న, పసుపు పంటలు వేశారు. ఈసారి తొలకరి ముందుగానే ప్రారంభమైనట్లు వాతావరణంలో మార్పులు కనిపించినప్పటికీ రైతులకు నిరాశే ఎదురైంది. పది రోజుల క్రితం వర్షం కురిసి మురిపించింది. ఆ తర్వాత ఆకాశంలో మార్పులు సంభవిస్తున్నా.. వర్షం కురిపించడంలో వరుణ దేవుడు దోబూచులాడుతూనే ఉన్నాడు.
కాగా, మృగశిర కార్తి వెళ్లిపోయింది. ఇప్పటికే భూముల్లో విత్తనాలు నాటడం పూర్తి కావాల్సింది. కానీ, మేఘాలు చాటుముఖం వేయడంతో అన్నదాత దిగాలు చెందుతున్నాడు. అక్కడక్కడా చిరుజల్లులు, మోస్తరు వర్షం కురుస్తున్నా.. విత్తనాలు విత్తుకునేందుకు వీలు లేకపోవడంతో రైతులు వాపోతున్నారు.
వర్షాలు లేక వేసిన పంటలు మొలకెత్తక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు.
బావులల్లో నీళ్ళు ఉన్న రైతులు పంటలకు నీళ్ళు పెడుతున్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నా, ఒక్క చుక్క వర్షం పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ మాసం చివరి కావస్తున్న వరణుడి జాడ లేదు, విత్తనాలు వేసేందుకు రైతులు ఆలోచిస్తున్నారు, వేసవికాలం మాదిరిగా ఎండలు కొడుతుందటంతో విత్తనాలు వేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
విత్తనాల రెట్లు అధికంగా ఉండడం, మండుతున్న ఎండలకు విత్తనాలు మొలకేత్తక నష్టపోవాల్సి వస్తుందని వర్షాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల చివర్లో నైన వర్షాలు కురుస్తాయో , లేక వేసిన పంటలు ఎండిపోతాయో అని రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు.