Friday, November 22, 2024
HomeతెలంగాణMallapur: పక్కనే గోదావరి..అయినా ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు ఎండాల్సిందే!

Mallapur: పక్కనే గోదావరి..అయినా ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు ఎండాల్సిందే!

పునరావాస గ్రామానికి, చివరి ఆయకట్టు గ్రామాలకు ఎస్సారెస్పి నీళ్లెందుకియ్యరు?

పక్కనే గోదారి ఉన్నా ఎస్సారెస్పీ కాలువ నీళ్ళు చివరి ఆయకట్టు గ్రామాలకు అందటం లేదు. అందుకే గోదారి పక్కనున్న రైతాంగం అంతా సాగునీటి కోసం కష్టపడుతున్నారు. ఎస్సారెస్పీ నీళ్ళ కోసం గేట్ల వద్ద రైతులు కాపలాగా ఉండాల్సిన దుస్థితి స్వరాష్ట్రంలో ఉండటం విచిత్రంగా అనిపించినా ఇది నగ్న సత్యం. కంట్లో కన్నీరు కార్చినా, పొలంలోకి చుక్క నీరు కూడా అందకపోవటం మెతుకు సీమలో రైతన్న పరిస్థితిని ఎండగడుతోంది. చివరి ఆయకట్టుకు నీళ్లు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ఏళ్ళు గడుస్తున్నా పునరావాస గ్రామాలకు సాగునీరు అందక, న్యాయం జరగట్లేదు.

- Advertisement -

చివరి ఆయకట్టు గ్రామాలపై చులకనేల?

చివరి ఆయకట్టు గ్రామలైన వాల్గొండ, కొత్త, పాత ధాంరాజ్ పల్లి, ఓబులాపూర్ ఎస్సారెస్పి ముంపు గ్రామమైన సంగెం శ్రీరాంపూర్ కు చుక్క నీళ్లు రావటం లేదు. రైతులు గేట్ల వద్ద కాపలాగా ఉంటున్నా పంటలకు నీరు అందటం లేదు. గతంలో నీళ్ల కోసం ఇరు గ్రామాల రైతులు ఎన్నోసార్లు ఘర్షణలకు దిగారు. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా తమని ఎవరూ పట్టించుకోవటం లేదని, అధికారుల పర్యవేక్షణ కరువయ్యిందని రైతులు ఆవేదన చెందుతున్న గోస ఎవరి చెవుల్లో పడటం లేదు. కొత్త ప్రభుత్వం అయినా రైతుల ఆవేదన తెలుసుకొని, తమ గ్రామాలకు నీళ్లు అందేలా చూడాలని తమ గోస వెళ్లబోసుకుంటున్నారు చివరి ఆయకట్టు రైతన్నలు.

ఎల్క కమలాకర్, సంగెం శ్రీరాంపూర్, మల్లాపూర్ మండలం, రైతు నాయకుడు

“మేము ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు అక్కడి నుండి సంగెం శ్రీరాంపూర్ గ్రామానికి వచ్చాము. మాది పునరావాస గ్రామం. చివరి ఆయకట్టు గ్రామమైనా మాకు ఎస్సారెస్పీ కెనాల్ నీళ్లు రావు, అధికారులకు, నాయకులకు చెప్పినా ప్రయోజనం లేదు. ఖర్చుపెట్టి బావులు, బోర్లు వేసుకొని పంటలు సాగుచేస్తున్నాం. గతంలో అనేకసార్లు సాగునీటి సమస్యపై నాయకులకు, అధికారులకు మొరపెట్టుకున్నాం అయినా ప్రయోజనం శూన్యం. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా నీటి సమస్యను పరిష్కరించాలి”.

మామిడి రాజ శేఖర్ రెడ్డి, కొత్త ధాంరాజ్ పల్లి

“ఎస్సారెస్పి కెనాల్ ఆయకట్టు క్రింద నాకు ఆరు ఎకరాల సాగు భూమి ఉన్నది. కెనాల్ నీళ్లు ఎప్పుడు రావు. మమ్మల్ని పట్టించుకునేవారు లేరు. గత పదేళ్ల కాలంలో మాజీ ఎమ్మెల్యేని కలిసి అనేకసార్లు మా గోస వివరించాం అయినా ఇప్పటికి ఎవ్వరు మా సమస్యను పట్టించుకోలేదు. లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేయించిన సరిపడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సాగునీటి కోసం ఇతర గ్రామస్తులతో మా గ్రామస్తులం వాగ్వాదం చేసిన, గేట్ల వద్ద కాపలాగా ఉన్న మాకు నీళ్లు వచ్చేది లేదు”.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News