స్థానిక సంస్థల ఎన్నికల సమరం దగ్గర పడుతుండటం, ఎలక్షన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచనలతో, ఎలక్షన్లు తొందరలోనే జరుగుతాయని ఊహాగానాలతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు మల్లాపూర్ మండల యువత సన్నద్ధమైంది. రాబోయే సర్పంచ్, సింగిల్ విండో, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువ నాయకులు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.
పోటీకి సై
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసి, విజయం సాధించి గ్రామాల్లో, మండలంలో పట్టు సాధించాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో ఇప్పటినుంచే గ్రామాల్లో రాజకీయం ప్రారంభించారు. తాము రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల్లో తమకు సహకరించాలని సీనియర్ నాయకులను ప్రాధేయ పడుతున్నారు. ఇన్నేళ్ళు తాము మీకు సహకరించామనీ, వచ్చే ఎన్నికల్లో తమకు సహకరించాలని, తమ గెలుపుకు కృషి చేయాలని, తమకే ఎంపీటీసి, సింగిల్ విండో, జడ్పిటిసి టికెట్లు కేటాయించాలని కోరుతున్నారు. తమ తమ పార్టీల అధినేతలతో టచ్ లో ఉంటూ, తాము చేస్తున్న కార్యక్రమాలకు నియోజకవర్గ నాయకులను పిలుస్తూ ముందుకు వెళుతున్నారు.
“రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలి, పదేండ్లు ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంపై కొట్లాడినం, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేసినం, ఈసారి ఎలాగైనా పోటీ చేసి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాం, రాబోయే ఎన్నికల్లో సీనియర్ల సలహాలు సూచనలతో పోటీలో విజయం సాధించేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాం” అని నత్తి రాం చెబుతున్నాడు.
“సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాం, సీనియర్లు ఈ సారి యువతకు అవకాశం ఇవ్వాలి, గతంలో సీనియర్ల గెలుపుకు కృషి చేశాం, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాకు అవకాశం ఇచ్చి, మా గెలుపుకు కృషి చేయాలి, రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నా, ప్రజల ఆశీర్వాదంతో గెలుపు సాధిస్తా అనే ఆశతో ఉన్నా” అంటూ గడ్డం నవీన్ ఉత్సాహంగా చెబుతున్నాడు.
“సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంతో ఆశగా, ఆసక్తితో ఉన్నా ఈసారి పోటీ చేసి విజయం సాధించి గ్రామ అభివృద్ది చేసేందుకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా, సీనియర్ల సలహాలు సూచనలతో పోటీలో విజయం సాధిస్తానని నమ్మకంతో ఉన్నా” అంటూ సూతారి (కేసరి). రాజేందర్ చెబుతున్నాడు.
పార్టీలకతీతంగా
కొందరు పార్టీలతో సంబంధం లేకుండా తమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్కొక్క పార్టీ నుండి ముగ్గురు లేదా నలుగురు పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎన్నికల్లో అయ్యే ఖర్చును సైతం ఇప్పటికే సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అధికార పార్టీకి చెందిన ఆశావహులు ఎంత ఖర్చుకైనా వెనకడుగు వేసేది లేదని చెబుతున్నారు. సీనియర్ నాయకుల ఎత్తులను దాటుకొని యువకులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి.