Suicide due to social media shaming : సోషల్ మీడియాలో ఓ వీడియో.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కన్నతల్లిని కొడుతున్న దృశ్యాలు బంధువులందరికీ చేరడంతో పరువు పోయిందని, తలెత్తుకోలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు కన్నీటితో రికార్డు చేసిన వీడియోలో అతను చెప్పిన చివరి మాటలు గుండెల్ని పిండేస్తున్నాయి. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది..? ఆస్తి గొడవలు ఎంతటి విషాదాన్ని మిగిల్చాయి..? క్షణికావేశంలో జరిగిన తప్పును సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఎంతటి ఘోరానికి దారితీసింది..?
‘నన్ను క్షమించు అమ్మా.. పరువు పోయింది, అందుకే వెళ్లిపోతున్నా’ అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి, దాన్ని మిత్రులు, కుటుంబ సభ్యులకు పంపించి ఓ వ్యాపారవేత్త, బీజేవైఎం నేత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో చోటుచేసుకుంది. ఆస్తి గొడవల నేపథ్యంలో కన్నతల్లిపై చేయి చేసుకున్న వీడియో వైరల్ కావడంతో, ఆ అవమాన భారాన్ని మోయలేక అతను ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
బీబీనగర్ సీఐ ప్రభాకర్‌రెడ్డి కథనం ప్రకారం..
హైదరాబాద్ ఉప్పల్ విజయపురికాలనీకి చెందిన రేవెల్లి రాజు (45) వ్యాపారం చేస్తూ, బీజేవైఎంలో రాష్ట్రస్థాయి నాయకుడిగా చురుగ్గా ఉంటున్నారు. కొంతకాలంగా అతనికి, అతని తల్లి, సోదరుడికి మధ్య ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. తన తల్లి తమ్ముడికే మద్దతుగా నిలుస్తోందన్న కోపంతో ఇటీవల రాజు ఆమెను కొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి, బంధువుల గ్రూపులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించడంతో రాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పరువు పోయిందని, ఇక సమాజంలో తలెత్తుకుని తిరగలేనని కుమిలిపోయాడు. ఈ క్రమంలోనే గురువారం ఆయన ఒక సెల్ఫీ వీడియోను చిత్రీకరించాడు.
‘నన్ను క్షమించు అమ్మా’.. కన్నీటి వీడ్కోలు: ఆత్మహత్యకు ముందు రాజు రికార్డు చేసిన వీడియోలోని మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. “ప్రపంచంలో ఏ కొడుకుకూ తల్లిని కొట్టాలని ఉండదు. కానీ పరిస్థితుల కారణంగానే ఆ తప్పు జరిగింది. నన్ను క్షమించు అమ్మా. అది తప్పే.. కానీ దాన్ని వీడియో తీసి అందరికీ పంపించి నన్ను బతకకుండా చేశారు. ఆ వీడియో తీసింది మా మరదలే, దానికి నా దగ్గర ఆధారాలున్నాయి. ఇల్లు, తమ్ముడి మొదటి పెళ్లి విషయంలో నేను ఎంతో ఖర్చు చేశాను, అయినా మా అమ్మ నన్ను మోసం చేసింది. అమ్మా.. నన్ను నమ్మించి గొంతు కోసినట్లుగా, దయచేసి నా భార్యా పిల్లలను అలా చేయకు. మిత్రులు, బంధువులు, పార్టీ శ్రేణులు అందరూ నన్ను క్షమించండి. నా కుటుంబానికి అండగా ఉండండి” అని వేడుకుంటూ ఆ వీడియోను అందరికీ పంపించాడు.
చెరువులో విగతజీవిగా.. రాజు కనిపించడం లేదంటూ అతని భార్య మహిమ గురువారం సాయంత్రం ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శుక్రవారం బీబీనగర్ పెద్ద చెరువులో ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానిక పోలీసులు, ఉప్పల్ కేసు వివరాలతో సరిపోల్చగా అది రాజుదేనని నిర్ధారించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి వివాదాలు, క్షణికావేశాలు, సోషల్ మీడియా దుర్వినియోగం కలిసి ఓ నిండు ప్రాణాన్ని బలిగొనడంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది.


