Sunday, October 6, 2024
HomeతెలంగాణManakonduru: అక్రమ నిర్మాణాలను పట్టించుకోని అధికారులు

Manakonduru: అక్రమ నిర్మాణాలను పట్టించుకోని అధికారులు

అందుకే అధికారులు స్పందించటం లేదా?

ఎన్ హెచ్ 563 రోడ్డు పనులు నిర్వహిస్తున్న రోడ్డు నిర్మాణ కంపెనీ కాంట్రాక్టర్ తో అధికారులు కుమ్మక్కైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కాంట్రాక్టర్ తో లోపాయికారి ఒప్పందం చేసుకోవటంతోనే కంపెనీలో ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు జరిగాయి. ఫలితంగా చెంజర్ల గ్రామ పంచాయతీ భారీగా ఆదాయం కోల్పోయిందని గ్రామస్తులంటున్నారు. వరంగల్ నుండి జగిత్యాల వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టిన కంపెనీ కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిచ్చాడు.

- Advertisement -

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేసిన నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పంచాయతీ రాజ్ అధికారుల తీరు పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామ పంచాయతీ పరిధిలో కరీంనగర్-వరంగల్ రహదారి పక్కన రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ భారీ మొత్తంలో అక్రమ నిర్మాణాలు చేపట్టాడు. రోడ్డు నిర్మాణ పనులు చేసే కంపెనీ కాంట్రాక్టర్ సుమారు 40 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని రైతుల నుంచి అగ్రిమెంట్ ద్వారా లీజుకు తీసుకున్నాడు. లీజుకు తీసుకున్న భూమిలో కంకర క్రషర్, సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్, డాంబర్ మిక్సింగ్ ప్లాంట్ లను నిర్మించాడు. అంతేకాకుండా కంపెనీలో పని చేసే ఉద్యోగులు, కార్మికుల కోసం నివాసాలను నిర్మించాడు. నిర్మాణాలు అన్నీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగానే నిర్మించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే అక్రమంగా నిర్మాణాలు చేసి,పంచాయతీ ఆదాయానికి గండి కొట్టారన్న ఆరోపణలున్నాయి.పంచాయతీ రాజ్ అధికారులు, రోడ్డు నిర్మాణ కంపెనీ కాంట్రాక్టర్ కుమ్మక్కై అక్రమ నిర్మాణాలు చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

అక్రమ నిర్మాణాల వ్యవహారంలో భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు తెలిసింది. కంపెనీకి ఇంచార్జిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ప్రజాప్రతినిధికి లక్షల్లో ముడుపులు ముట్టజెప్పి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేసినట్టు వినికిడి. కంపెనీ చేసిన అక్రమ నిర్మాణాలపై అధికారుల్లో చీమకుట్టినట్లు కూడా చలనం రావడం లేదు. పంచాయతీ రాజ్ అధికారుల వైఖరి దున్నపోతు మీద వాన పడినట్లు అన్న చందంగా తయారైంది. పంచాయతీ రాజ్ అధికారులు అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇప్పటికైనా పంచాయతీ రాజ్ అధికారులు చెంజర్ల క్యాంపులోని అక్రమ నిర్మాణాలపై స్పందించి చర్యలు తీసుకుంటారా..? లేదా..? వేచి చూడాలి మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News