తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా మంచాల మండలంలోని కొర్రవానితాండ, లోయపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి వేడుకల్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామపంచాయతీల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించి, లోయపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… పల్లెల సమగ్ర అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని. పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారాయని, తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శమని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్టాలలో లేని విధంగా ప్రతీ పల్లెల్లో స్మశానవాటిక, ప్రకృతి వనాలు నిర్మించుకున్నామని అన్నారు.
నేడు తెలంగాణ పల్లెలు మౌలిక వసతులతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణాలతో దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులకు ఉత్తమ సేవా పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామ శాఖ అధ్యక్షుడు జానయ్య తల్లిని ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటా చారి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చెంద్రయ్య, ఎంపిపి నర్మదా, సర్పంచ్లు, ఎంపీటీసీలు మండల అధ్యక్షుడు చీరాల రమేష్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.