ఓటు హక్కు సక్రమంగా వినియోగించడం ద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకొని దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించవచ్చని, అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నిర్భయంగా, పారదర్శకంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. హైదరాబాద్ నుంచి సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో జాతీయ ఓటరు దినోత్సవం, పి.ఎస్.ఈ. ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ, ఓటర్ ఐ.డి.తో ఆధార్ అనుసంధానం ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ… జిల్లాలలో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితాలో ఉన్న పి.ఎస్.ఈ. ఎంట్రీలు వంద శాతం క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్నినిర్వహించేందుకు అవసరమైన పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. 80 సంవత్సారాలు వయస్సు పైబడిన ఓటర్లను, నూతన ఓటర్లను సన్మానించాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ అందించే ఓటరు పాటను స్థానిక కేబుల్ ఛానళ్లలో, సినిమా థియేటర్లలో ప్రదర్శించాలని, ఈ సంవత్సరం ఓటరు దినోత్సవం థీమ్ అయిన “నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్” ప్రకారం ప్రతి ఒక్కరు ఎన్నికల సమయంలో ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.