సమాజంలో మనుషులందరం సమానమే అని చాటిన మహనీయుడు బసవేశ్వరుడు అని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా బసవేశ్వరుడు 890వ జయంతి ఉత్సవాలలో పాల్గొని బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కలెక్టర్ బాధవత్ సంతోష్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుడు ప్రజలంతా సమానమేనని, కుల, వర్ణ, వర్గ, జాతి, లింగ, మత వివక్షలతో సంబంధం లేకుండా కలిసి ఉండాలని సమనత్వాన్ని బోధించిన మహనీయుడని అన్నారు. తన వచన సాహిత్యంతో ప్రజలను ఏకం చేస్తూ వీరశైవ మతాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఆహారం, ఇల్లు, వస్త్రాలు, జ్ఞానం, వైద్యం కనీస హక్కులు అని, భక్తి కన్నా సత్ప్రవర్తన, మానవత్వం ముఖ్యమని, శ్రమను మించిన సంపద లేదని తెలియజేశారని అన్నారు. బసవేశ్వరుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని, బసవేశ్వరుడు ఆచరించిన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆయన బోధించిన ఆశయాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి వినోద్కుమార్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.