రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ఈ నెల 9వ తేదీన ప్రారంభించేందుకు సమీకృత కలెక్టరేట్ భవనం అన్ని హంగులు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ లోని సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల (కలెక్టరేట్) భవన సముదాయం, బహిరంగ సభాస్థలి, ప్రాంగణాలను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, మంచిర్యాల డిసిపి సుధీర్ రామ్నాథ్ కేకన్, శాసన మండలి సభ్యులు దండే విఠల్, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం, సభాస్థలి ఏర్పాట్లపై పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రజల కోసం త్రాగునీరు, మజ్జిగ పంపిణీ నిరంతరంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ దీపాలు, మైక్, సౌండ్ సిస్టమ్ల పనులను పకడ్బంధీగా చేపట్టాలని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.