జి.ఓ.నం: 58,59 ప్రకారం ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణకు అర్హత గల లబ్దిదారుల కొరకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పించినట్డు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. జి.ఓ. నం: 58,59 క్రింద అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణకు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు క్రమబద్దీకరణ వర్తించే కటాఫ్ తేదిని 2014 జూన్ 2వ తేదీ నుండి 2020 జూన్ 2వ తేదీ వరకు పొడిగించినట్టు వివరించారు. ఈ ప్రకారం అర్హత గల వారు మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆక్రమిత అసైన్డ్, అభ్యంతరం లేని ఇతర ప్రభుత్వ స్థలాలు, అర్బన్ సీలింగ్ భూములను నిబంధనల మేరకు హక్కులు బదలాయింపు కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. జి.ఓ. నం. 58 ప్రకారం 125 చదరపు గజాలలోపు స్థలాలు ఉన్న పేదలకు ఉచితంగా, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణమైతే మార్కెట్ ధరకు క్రమబద్దీకరించడం జరుగుతుంందని తెలిపారు. ఆక్రమణదారులు 2014 జూన్ 2 తేదీలోపు సంబంధిత స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉండాలన్న నిబంధనను సవరిస్తూ 2020 జూన్ 2వ తేదీలోపు వారికి అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. మార్చి 17వ తేదీన విడుదల చేసిన నూతన జి.ఓ. నం. 29 ప్రకారం దరఖాస్తులు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం మీ-సేవ కేంద్రాలలో జి.ఓ. నం. 58, 59 పోర్టల్ను తిరిగి తెరిచిందని, 58, 59 ఉత్తర్వుల క్రింద గతంలో తిరస్కరణకు గురైన దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. సింగరేణి గనులు ఉన్న ప్రాంతాల్లో జి.ఓ. నం. 76 క్రింద ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ కొరకు తాజాగా దరఖాస్తులు స్వీకరించి అర్హులకు పట్టాలు అందజేయడం జరుగుతుందని, గతంలో సరైన ఆధారాలు లేక దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు, దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
జి.ఓ. నిబంధనల ప్రకారం స్థలంలో నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నట్లు ఆధారం చూపించాల్సి ఉంటుందని, ఇంటి పన్ను, ఇంటి నంబరు రశీదులు, నల్లా పన్ను, విద్యుత్ బిల్లు లాంటివి ఆధారాల క్రింద దాఖలు చేయాలని, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు లాంటివి దరఖాస్తుతో పాటు జత చేయాలని తెలిపారు. 125 గజాల కంటే ఎక్కువ స్థలం ఆక్రమించుకున్న వారికి జి.ఓ. నం. 59 ప్రకారం మార్కెట్ ధర లెక్కించడం జరుగుతుందని, 126 నుంచి 250 గజాల వరకు రిజిస్ట్రేషన్ ధరలో 50 శాతం చెల్లించవలసి ఉంటుందని, 251 నుంచి 500 గజాలలో లోపు 75 శాతం చెల్లించవలసి ఉంటుందని, 500 గజాలు దాటితే 100 శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే స్థలం అయితే పరిమాణంతో నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్ ధర చెల్లించి క్రమబద్ధీకరించుకోవలసి ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.