ఆదివాసుల ఆరాధ్య దైవం, విశిష్ట చరిత్ర కలిగి.. కోరుకున్న మొక్కలు తీర్చే దేవళ్ళు అయిన గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి ఆలయానికి, వేలాల గట్టు మల్లన్న ఆలయానికి కొత్త రోడ్లను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రారంభించారు. దీంతో నియోజకవర్గంలోని ప్రజల చిరకాల కోరికను ఎమ్మెల్యే బాల్క సుమన్ తీర్చినట్టైంది.
రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ లోని గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి ఆలయానికి, వేలాలా గ్రామ పంచాయతీలోని వేలాల గట్టు మల్లన్న ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారులు రెండు ప్రధాన రహదారులకు 4.30 కోట్ల నిధులు కేటాయించి.. ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండలంలో ప్రతి సంవత్సరం మహా శివరాత్రి పర్వదినాన సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యే సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ వేలాల గట్టు మల్లన్న ఆలయం ఉంది. ఈ గుడికి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. 2.20 కోట్లతో వేలాల కమాన్ దగ్గర నుంచి గుట్టపైన ఆలయం వరకు నూతనంగా నిర్మించే సుమారు రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు పూర్తయింది.