Friday, November 22, 2024
HomeతెలంగాణManchiryala: 'మన ఊరు మన బడి' పనులు త్వరగా పూర్తి చేయాలి

Manchiryala: ‘మన ఊరు మన బడి’ పనులు త్వరగా పూర్తి చేయాలి

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌళిక సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమం మొదటి విడతలో భాగంగా జిల్లాలోని పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి, జిల్లా విద్యాశాఖ అధికారి సదయ్యతో కలిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డివిజనల్, సహాయ ఇంజనీర్లు, మండల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపికైన పాఠశాలల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద చేపట్టిన ప్రహారీగోడ, వంటశాల, మూత్రశాలలు, శౌచాలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. అదనపు తరగతి గదులు, భోజనశాల, విద్యుత్, త్రాగునీరు ఇతర మరమ్మత్తు పనులను మాసాంతంలోగా పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి సిద్ధంగా ఉంచాలని తెలిపారు. మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులు సమన్వయంతో పని చేస్తూ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పనులు నాణ్యతగా ఉండే విధంగా చూడాలని సూచించారు.
పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, మిగిలి ఉన్న పనులు పూర్తి వివరాలతో నివేదిక రూపొందించి అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల ఇంజనీర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News