Thursday, September 19, 2024
HomeతెలంగాణManchiryala: గొర్రెల పంపిణీ సద్వినియోగం చేసుకోండి

Manchiryala: గొర్రెల పంపిణీ సద్వినియోగం చేసుకోండి

గొర్రెల పెంపకందారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన రెండో విడత గొర్రెల పంపిణీకార్యక్రమాన్ని అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా పశు వైద్యాధికారి డా॥ రమేష్, సంయుక్త సంచాలకులు ఈ. శంకర్ లతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో గొల్లకురుమ, యాదవ సొసైటీలు 183 ఉన్నాయని, గ్రామసభల ద్వారా అర్హత కలిగిన లబ్దిదారులను లాటరీ పద్దతిలో ఎంపిక చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 4 వేల 138 మంది లబ్దిదారుల వివరాలను గ్రౌండింగ్ చేసినట్టు తెలిపారు. అభ్యర్థులు ప్రాథమిక గొర్రెల కాపరుల సహకార సంఘం నందు సభ్యత్వం కలిగి ఉండాలని, 18 సం॥ల వయస్సు పైబడిన వారు అర్హులని, ప్రభుత్వ ఉద్యోగము గల వారికి పథకం వర్తించదని, ప్రాథమిక గొర్రెల కాపరుల సహకార సంఘం ఎన్నికల ఓటరు జాబితా పశు వైద్యాధికారికి అందించాలని తెలిపారు. అర్హత గల అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతాలో 43 వేల 750 రూపాయలు ఉంచాలని, పశు వైద్యాధికారి ఇచ్చిన వర్చువల్ గుర్తింపు సంఖ్య ఉండాలని, నింపిన ఆర్.టి.జి.ఎస్. / ఎన్.ఈ.ఎఫ్.టి. ఫారంను బ్యాంక్లో ఇచ్చి సంబంధిత రశీదును పొంది అట్టి ప్రతిని పశు వైద్యాధికారికి అందించాలని, డి.డి., చెక్, జి.పే., డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా జరిపిన చెల్లింపులు పరిగణలోకి తీసుకోవడం జరుగదని తెలిపారు. మొదటి విడతలో లబ్ది పొందని వారికి ఈ పథకం వర్తిస్తుందని, మొదటి / రెండవ విడతలో పొందని వారు చనిపోయినట్లయితే వారి నామినికి గొర్రెలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఒక యూనిట్ 20 గొర్రెలు, 1 పొట్టేలు ఉంటాయని, 2017లో యూనిట్ ధర 1 లక్షా 75 వేల రూపాయలుగా నియించడం జరిగిందని, పొట్టేలు ధర 10 వేల రూపాయలు, ఒక గొర్రె ధర 7 వేల 400 రూపాయలతో 20 గొర్రెలకు 1 లక్షా 48 వేల రూపాయలు, రవాణా ఖర్చులు 6 వేల 500 రూపాయలు, దాణా 3 వేల 500 రూపాయలు, మందులు 500 రూపాయలు, గొర్రెల భీమా 5 వేల రూపాయలు, ఇతరములు 1 వేయి 500తో మొత్తంగా యూనిట్ ధర 1 లక్షా 75 వేల రూపాయలు ఉంటుందని, ఇందులో ప్రభుత్వం 75 శాతం రాయితీ విలువ 1 లక్షా 31 వేల 250 రూపాయలు ఇస్తుందని, లబ్దిదారులు 25 శాతం 43 వేల 750లు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. గొర్రెల కొరకు ప్రకాశం, కర్నూల్, కర్ణాటక, బళ్ళారి, కొప్పల్, సోలాపూర్, మహారాష్ట్ర వెళ్ళవలసి ఉంటుందని, వాహనానికి జి.పి.ఆర్.ఎస్. వ్యవస్థతో ట్రాకింగ్ చేయబడుతుందని, కొనుగోలు కొరకు జిల్లా స్థాయి అధికారి వెళ్ళడం జరుగుతుందని తెలిపారు. పథకం అమలు, నిర్వహణపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని, జిల్లా స్థాయిలో చేయవలసిన వ్యవహారాలు తెలుసుకొని ఉండాలని, వెటర్నరీ సహాయకులు, సర్జన్, వైద్యులు, సాంకేతిక సిబ్బంది ఉంటారని తెలిపారు. గొర్రెల కొనుగోలు చేయడం కొరకు నియమించిన జిల్లా స్థాయి అధికారి లబ్దిదారులను తీసుకువెళ్తారని, కొనుగోలు సమయంలో చెక్స్ట్ ప్రకారం గొర్రెల టాగింగ్, ఫొటోలు తీసి సంబంధిత యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుందని, గొర్రెల ఆరోగ్యం, విలువ, భీమా ధృవీకరణ ప్రక్రియ పూర్తిగా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

జిల్లా స్థాయి అధికారులు సుమారు 7 రోజుల పాటు అక్కడే ఉంటూ క్షేత్రస్థాయిలో గొర్రెల కొనుగోలు చేసి తరలించే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయాలని, ఒకవేళ అసౌకర్యంగా ఉన్నట్లయితే వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసేలా కార్యచరణ రూపొందించాలని, అర్హులైన లబ్దిదారుల వివరాలతో జాబితా తయారు చేయాలని, జిల్లా సి.పి.టి. బృందానికి పంపిణీ చేసే ప్రాంతాన్ని తెలియజేయాలని తెలిపారు. 2 మండలాలను ఎంపిక చేసుకొని లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం వెటర్నరీ సహాయకులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వెటర్నరీ సహాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News